

పాచిపెంట,మన న్యూస్:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రజలకు చేరువయ్యే విధంగా, సమస్యలు పరిష్కారం దృష్ట్యా టిడిపి ప్రభుత్వం పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి పాచి పెంట మండలం పద్మాపురం పంచాయతీ బట్నాయక వలస గిరిజన గ్రామంలో తహసిల్దార్ డి రవి, ఎంపీడీఓ పట్నాయక్, ఆర్ ఐ రమణ, మిగతా మండల అధికారులు, పలు శాఖల సిబ్బంది పల్లె నిద్ర కార్యక్రమంలో హాజరయ్యారు. ముందుగా గిరిజన బాలురు వసతి గృహము పరిశీలించి బాలలకు వండిన వంటలను రుచి చూశారు. అన్ని సంతృప్తికరంగా ఉండడంతో సంబంధిత యాజమాన్యాన్ని కొనియాడారు. తర్వాత గ్రామంలో మంచినీటి సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి సమస్య లేదని స్థానిక గిరిజన ప్రజలు చెప్పడంతో పారిశుధ్య పనులు పరిశీలించారు. కాలువలన్నీ బాగానే ఉన్నప్పటికీ కాలువలు గుండా ప్రవహించే కలుషిత మైన మురుగు నీరు గ్రామానికి పక్కనే నిలవ ఉండడంతో గ్రామస్తులంతా తహసీల్దార్,ఎంపీడీవో ల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. మురుగునీరు కారణంగా దోమల ప్రభావం ఎక్కువై మలేరియా,టైఫాయిడ్, డయేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు అధికారులకు తెలియజేయగా వెంటనే స్పందించిన ఎంఆర్ఓ, ఎంపీడీఓ సంబంధిత సిబ్బంది సహాయంతో కూలీలను ఏర్పాటు చేసి మురుగు నీరు నిలవ ఉండకుండా కాలువలు తీసి గ్రామానికి దూరంగా వెళ్లేటట్టు చర్యలు చేపట్టారు. వెంటనే పరిష్కరించినందుకుగాను అధికారులను గిరిజన ప్రజలు అభినందించారు.