మన ద్యాస, నెల్లూరు, ఆగస్టు 16 :శాంతిభద్రతల పరిరక్షణలోనూ, ప్రజలకు రక్షణగా నిలవడంలోనూ పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఆదివారం కొడవలూరులో వీపీఆర్‌ ఫౌండేషన్ తరఫున నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)లకు ఎమ్మెల్యే రూ.30 లక్షల విలువైన మూడు బొలెరో వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంతి రెడ్డి తనయులు, తెలుగు దేశం యువ నాయకులు డాక్టర్‌ అర్జున్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో పోలీసులు సకాలంలో ఘటనా స్థలాలకు చేరుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, వారి నిత్య అవసరాల నిమిత్తం నియోజకవర్గంలో రెండో విడతగా ఈ వాహనాలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. కోవూరు నియోజకవర్గంలో పోలీసులు ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా పూర్తి స్వేచ్ఛతో పనిచేయవచ్చని స్పష్టం చేశారు. అదే సమయంలో అవినీతి, అక్రమాలను అడ్డుకోవడంలో ‘తన, మన’ అనే భేదాలు చూడకుండా నిష్పక్షపాతంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, పోలీసులు మంచి సమన్వయంతో పనిచేస్తూ నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాపాడుతున్నారని మెచ్చుకున్నారు. ప్రజలకు అండగా నిలుస్తూ 24 గంటల పాటు నిరంతరం సేవలు అందిస్తున్న పోలీసు వ్యవస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల , డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు,కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి , విడవలూరు ఎస్సై సాయి కళ్యాణ్, ఇందుకూరుపేట ఎస్సై నవీన్ కుమార్, కూటమి నాయకులు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *