మన ధ్యాస, విడవలూరు,ఆగస్టు 15 : దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు భాగస్వామ్యం అందించడమే నిజమైన దేశభక్తి అని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శనివారం విడవలూరు జడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమని అన్నారు. దేశంలో ఎన్నో రకాల పండుగలు జరుపుకున్నప్పటికీ, అందరం కలిసి జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్య్ర దినోత్సవమని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని చూపినా, సుభాష్ చంద్రబోస్ పోరాట మార్గాన్ని ఎంచుకున్నా, భగత్ సింగ్ ఉరికంబం ఎక్కినా.. ఇవన్నీ భావి భారత భవిష్యత్తు కోసమేనని అన్నారు. దాదాపు 200 ఏళ్ల బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొంది 79 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ రోజు 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.దేశ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. విద్యార్థులు పెద్ద కలలు కనాలని, ఉన్నత స్థాయికి ఎదిగి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఒక విద్యార్థి బాగా చదివితే అది దేశ నిర్మాణమేనని, ఒక యువకుడు నైపుణ్యాన్ని నేర్చుకుని ఉద్యోగం సాధిస్తే అది దేశ నిర్మాణమేనని అన్నారు. ఒక రైతు మరింత ఉత్పాదకత సాధించినా, ఒక మహిళ ఆర్థికంగా ఎదిగి మరో మహిళకు అండగా నిలిచినా అది కూడా దేశ నిర్మాణంలో భాగమేనని పేర్కొన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఒక మొక్క నాటడం కూడా దేశభక్తిలో భాగమే అవుతుందని తెలిపారు.విడవలూరు మండలానికి చెందిన పుచ్చలపల్లి సుందరయ్య పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్మా గాంధీ బుచ్చిరెడ్డిపాళెం నుంచి విడవలూరు మీదుగా ఊటుకూరు వరకు ప్రయాణించి, ఇక్కడి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న విడవలూరు మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.అభివృద్ధి చెందుతున్న భారత్స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారతదేశం ఎంతో అభివృద్ధి చెంది, ప్రపంచంలో ఒక శక్తిగా ఎదుగుతోందని ఎమ్మెల్యే అన్నారు. విజ్ఞానం నుంచి సాంకేతికత వరకు, అంతరిక్షం నుంచి డిజిటల్ రంగం వరకు, మౌలిక వసతుల నుంచి ఆర్థిక అభివృద్ధి వరకు ప్రతి రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతోందని పేర్కొన్నారు. ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఎదిగిందని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో భారత శాస్త్రవేత్తలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి మన దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలకు కూడా సహాయం చేశారని గుర్తుచేశారు. ఒకప్పుడు ఇతర దేశాల నుంచి టెక్నాలజీని తీసుకున్న మనం, ఈ రోజు చంద్రుడిని చేరే స్థాయికి ఎదిగామని అన్నారు. ఇది మన శాస్త్రవేత్తల ప్రతిభ, మన యువత శక్తి, భారతదేశ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. అయితే మన లక్ష్యం ఇక్కడితో ఆగిపోకూడదని, 2047 వికసిత్ భారత్ మన ముందున్న లక్ష్యమని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2047 వికసిత్ భారత్ విజన్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారని తెలిపారు. భావి తరాల కోసం ముందుగానే ఆలోచిస్తూ, ఈ రోజే బలమైన పునాదులు వేస్తున్నారని అన్నారు. విద్యార్థులు పెద్ద కలలు కనాలని, గురువులు, ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిస్తూ, విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.మహిళా సాధికారతకు ‘స్త్రీ శక్తి’ పథకం.మహిళల కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి పథకం’ గురించి ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిందని, మహిళలు విద్య, ఉపాధి, వైద్యం, వ్యాపారం వంటి అవసరాల కోసం స్వతంత్రంగా ప్రయాణించే అవకాశాలను ఈ పథకం కల్పిస్తోందని తెలిపారు. మహిళలకు అండగా ఈ పథకాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలని అన్నారు. మహిళల శక్తి ఏమిటో మన ప్రభుత్వం చూపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నందువల్లే ఈ రోజు తనలాంటి మహిళా శాసనసభ్యులు ప్రజల ముందుకు వచ్చి సేవ చేసే అవకాశం లభించిందని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.

