రేణిగుంట తులకానమ్మ జాతర మహోత్సవాలు పూర్తి…ప్రముఖుల హాజరు, విశేష అన్నదానం…హాజరైన టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మరియు ప్రముఖులు.


​రేణిగుంట ఆగష్టు 4. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం పాత చెక్‌పోస్ట్ సమీపంలోని బాలాజీ నగర్‌లో స్వయంభూగా వెలసిన శ్రీ శ్రీ శ్రీ తులకానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ఘనంగా ముగిశాయి. ఈ క్షేత్రంలోని తులకానమ్మ అమ్మవారు స్వయంభూగా వెలిశారని, అమ్మవారి విగ్రహం రోజు రోజుకూ కొద్దికొద్దిగా పెరుగుతుందని భక్తుల నమ్మకం. తమ కష్టాల్లో ఉన్నప్పుడు “తానున్నానంటూ” అభయమిచ్చే ఇలవేల్పుగా, అడిగిన వెంటనే కోరికలు తీర్చే మహిమాన్విత తల్లిగా ప్రసిద్ధి చెందిన అమ్మవారికి గడిచిన 40 సంవత్సరాలుగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైన కృష్ణన్, గణేషన్ కుటుంబ సభ్యులు అత్యంత నియమనిష్టలతో నిత్య పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఈ జాతరలో మొదటి రోజున అమ్మవారికి ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించగా, రెండో రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో పొంగళ్లు నైవేద్యంగా సమర్పించి, తమ మొక్కుబడుల్లో భాగంగా పొట్టేళ్లు, కోళ్లను అమ్మవారికి అర్పించారు. తమ కోరికలు తీర్చినందుకు కృతజ్ఞతగా భక్తులు ఈ సంవత్సరం అమ్మవారికి విలువైన పంచలోహ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమంలో రేణిగుంట పరిసర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకల్లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, రమ్య, సూరజ్ రజాక్, కవిత, బాలాజీ, ప్రభాస్, శివ, సతీష్, సీయోధన తదితర ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కుడి-ఎడమల క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ వంటి అన్ని సౌకర్యాలను పక్కాగా పర్యవేక్షించి జాతరను విజయవంతంగా ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *