రాళ్లపై పేర్లు చెక్కుకోవడం కాదు.. ప్రజల గుండెల్లో నిలవడమే నిజమైన పాలన: తోట్టంబేడు పర్యటనలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేపట్టిన “మీ ఇంటికి మీ సుధీరన్న” కార్యక్రమం తోట్టంబేడు మండలం కాసారం పంచాయతీ పరిధిలోని కొత్త హరిజనవాడ మరియు పెద్ద హరిజనవాడలలో రెండవ రోజు అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే ప్రతి ఇంటికీ వెళ్లి గ్రామస్తులతో ఆత్మీయంగా ముచ్చటించారు. మన అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు చూపించిన ఆప్యాయత, వారి ముఖాల్లో కనిపించిన ఆనందమే తనకు కొండంత బలమని, ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

​పర్యటనలో భాగంగా గ్రామంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో వేసిన సర్వే రాళ్లను పరిశీలించిన ఆయన గత ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఊరికి రూపాయి ఉపయోగపడే పని చేయకుండా, వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తూ రాళ్లపై పేర్లు, పార్టీ బొమ్మలు చెక్కించుకోవడానికే ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. రాళ్లపై పేర్లు రాసుకోవడం గొప్ప కాదని, ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా అభివృద్ధి చేసి చూపించడమే నిజమైన పాలన అని ఆయన వ్యాఖ్యానించారు.

​ఆ ఆర్భాటపు పాలనకు భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే (2024–2026) ఒక్క కాసారం పంచాయతీలోనే వివిధ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కోసం మొత్తం 11 కోట్ల 28 లక్షల 2 వేల 540 రూపాయలను ప్రజల ఖాతాల్లోకి మరియు ఊరి అభివృద్ధికి ఖర్చు చేశామని ఎమ్మెల్యే గర్వంగా వెల్లడించారు. అంతేకాకుండా గ్రామానికి కావలసిన మరిన్ని అభివృద్ధి పనులకు అధికారులతో ఎస్టిమేషన్లు సిద్ధం చేయిస్తున్నానని, త్వరలోనే ఆ పనులన్నీ ప్రారంభించి పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. ప్రజల ప్రతి సమస్య పరిష్కారానికి తాను ఎప్పుడూ తోడుగా ఉంటానని స్పష్టం చేసిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, పార్లమెంటు నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జీలతో పాటు తోట్టంబేడు మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *