Oplus_131072

రాయదుర్గం : పేదల కడుపు నింపాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థలో దారుణ అక్రమాలు వెలుగుచూశాయి. బొమ్మనహల్ మండలం పరిధిలోని గోవిందవాడ గ్రామ రేషన్ షాప్ నెం.10లో బియ్యం పంపిణీ పేరుతో ‘డబుల్ బకెట్’ మాయాజాలం నడుస్తోందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.గ్రామస్తుల కథనం ప్రకారం, మంగళవారం జరిగిన పంపిణీలో సాధారణంగా ఒక బకెట్‌తో తూకం వేయాల్సి ఉండగా, డీలర్ ఏకంగా రెండు బకెట్లను తూకం యంత్రంపై ఉంచి బియ్యం కొలిచారని చెబుతున్నారు. ఈ ఎత్తుగడతో ఒక్కో కార్డుదారునికి సుమారు 2 కిలోల వరకు బియ్యం తక్కువగా అందుతోందని ఆరోపిస్తున్నారు.“అడిగితే సమాధానం చెప్పరు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు” అని పలువురు లబ్ధిదారులు వాపోయారు. బియ్యం తూకం వేయించే సమయంలో పారదర్శకత లేకపోవడం, తూనికల యంత్రాల తనిఖీ జరగకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందని గ్రామ పెద్దలు అంటున్నారు.

సివిల్ సప్లైస్, తూనికల కొలతల శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిరంతర పర్యవేక్షణ లేకపోవడమే డీలర్లకు దండిగా మారిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. “డిప్యూటీ తహశీల్దార్ గానీ, సంబంధిత అధికారులు గానీ మా గ్రామానికి రావడం లేదు. అందుకే ఇలాంటి అక్రమాలు బహిరంగంగా జరుగుతున్నాయి” అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

గోవిందవాడ రేషన్ షాపుపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, తూకం యంత్రాలను పరిశీలించి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పేదల నోటికొచ్చే గింజను కూడా కాజేస్తున్న వారిపై ప్రభుత్వం ఉదాహరణాత్మక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *