
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా నరకప్రాయంగా మారిన రోడ్డు సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రజాప్రతినిధుల పట్టుదల, సుదీర్ఘ పోరాటాల ఫలితంగా రోడ్డు పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. నేడు ఈ పనులను మండల ప్రజా పరిషత్ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఏలేశ్వరం మండలంలోని ఏజెన్సీ ప్రధాన రోడ్డు అధ్వాన స్థితిపై స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలే పరమావధిగా, పార్టీలకు అతీతంగా నేడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి రోడ్డు పనులను పరిశీలించారు.వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు మరియు సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొని పనుల నాణ్యతను తనిఖీ చేశారు.రోడ్డు పనుల ప్రారంభంలో కాంట్రాక్టర్ల నుంచి సరైన సహకారం అందకపోయినప్పటికీ, స్థానిక శాసనసభ్యురాలి ప్రత్యేక చొరవతో పనులు పట్టాలెక్కాయని ఎంపీపీ బుజ్జి వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు, ప్రజల కష్టాలను గుర్తించి ఈ రోడ్డు నిర్మాణానికి ఆమె చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. పార్టీలకు తావు లేకుండా అభివృద్ధి కోసం అందరూ ఏకతాటిపైకి వచ్చి పనులను పర్యవేక్షించడం విశేషం.పనుల నాణ్యత పట్ల సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ పనులను చూసి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన ఈ రోడ్డు పూర్తి చేసి ప్రజల రవాణా కష్టాలను తీర్చాలని అధికారులు, వర్కర్లను నేతలు కోరారు.
