
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని 3వ వార్డు ఉన్న ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 3వ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ గారు ముఖ్య అతిథిగా హాజరై, పాఠశాల విద్యార్థులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను వేశారు.ఈ సందర్భంగా బదిరెడ్డి గోవింద్ మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాలు లోపు చిన్నారులకు ఆల్బెండజోల్ సగం మాత్ర (200 మిల్లీ గ్రాములు) నీళ్లలో కలిపి పట్టించాలి. 400 మిల్లీ గ్రాముల మాత్రను మధ్యాహ్నం భోజనం అయ్యాక చప్పరించేలా చూడాలి. మాత్రను మింగనీయకూడదు అన్ని తెలిపారు.. ఈ రోజు ఏ కారణంతోనైనా మాత్రలు తీసుకోని, అందుబాటులో లేని పిల్లలకు మళ్లీ 24వ తేదీన వేయించుకోచని అన్నారు .పిల్లల్లో వచ్చే రక్తహీనతను నివారించడానికి, వారి శారీరక, మానసిక ఎదుగుదల సక్రమంగా ఉండటానికి నులిపురుగుల నివారణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా నులిపురుగుల వ్యాప్తిని అరికట్టవచ్చని పిల్లలకు అవగాహన కల్పించారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో విద్యార్థులందరికీ మాత్రల పంపిణీ పూర్తి చేశారు.పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న కౌన్సిలర్ గోవింద్ ని పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.