రాపూరు, కలువాయి,సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర మంత్రి రామనారాయణరెడ్డి మన ధ్యాస,నెల్లూరు, డిసెంబర్ 26 : రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, రెవెన్యూశాఖ మంత్రి కి, జిల్లా కలెక్టర్ కి తన తరపున విజ్ఞప్తి నివేదికలను అందజేశానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విభజన నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యంతరాలు తెలియజేయడానికి నేటితో ఆఖరి రోజు కావడంతో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు.శుక్రవారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి మంత్రి ఆనం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్రకు తమ వినతి పత్రాలు, అభ్యంతరాలను అందజేశారని మంత్రి వివరించారు. తాను రాపూరు, వెంకటగిరి నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు, ఆ ప్రాంతాల ప్రతినిధిగా, మంత్రిగా నెల్లూరు జిల్లా భవిష్యత్ దృష్ట్యా ఈ మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని, అలాగే ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లో కలపాలని ముఖ్యమంత్రి కి విన్నవించానన్నారు. ఈ విషయమై జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర కి కూడా తన విజ్ఞాపన పత్రాన్ని అందజేశానని తెలిపారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలకు మంత్రి ఆనం అభినందనలు తెలిపారు.నూతనంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన బీద రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, నెల్లూరు ఇన్‌చార్జి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన రూప్‌కుమార్ యాదవ్‌లను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లా పార్లమెంటు టీడీపీ కమిటీకి ఎంపికైన ఆత్మకూరు నేతలను, రాష్ట్రస్థాయిలో డైరెక్టర్ పదవులు పొందిన వారిని మంత్రి ఆనం సత్కరించారు. దివంగత నేత ఎన్‌టిఆర్ శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ముద్రించిన వంద రూపాయల నాణేలను జిల్లా పార్లమెంటు టీడీపీ కమిటీ సభ్యులకు అందజేస్తూ, ఎన్‌టిఆర్ స్ఫూర్తి, పరిపాలనా దక్షతను ఆదర్శంగా తీసుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సమర్థవంతమైన నాయకత్వంతో జిల్లా పార్టీ కమిటీ : మంత్రి ఆనం. జిల్లాలో పార్టీ పటిష్టతకు సమర్థవంతమైన నాయకత్వంతో కూడిన జిల్లా కమిటీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,నారా లోకేష్ నియమించడం ఎంతో ఆనందకరమని మంత్రి ఆనం తెలిపారు.అనుభవం ఉన్న నాయకులు బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి వంటి వారికి, సుదీర్ఘకాలంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులకు బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని పేర్కొన్న మంత్రి, ఈ సమర్థవంతమైన టీమ్‌తో అందరిని సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, అలాగే నెల్లూరు జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ డి సి సి బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజరెడ్డి, మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి, స్థానిక నేతలు గిరి నాయుడు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.







