మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 23:పురాతన ఆలయాల అభివృధి కూటమి ప్రభుత్వ హయాం లోనే సాధ్యమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న శ్రీ వెంకటమ్మ పేరంటాళ్ళ అమ్మవారి ఆలయ అభివృధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ తో కలిసి పేర్కొన్నారు.ఆదివారం సాయంత్రం రంగనాయకుల పేటలోని వెంకటమ్మ పేరంటాలు ఆలయంలో రూ.1.15 కోట్లతో మూడంతస్తుల రాజగోపురం, మహా మండపం నిర్మాణం, అభివృద్ధి పనులకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంయుక్తంగా భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…. దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని, మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ నెల్లూరు నగరాన్ని సుందరంగా తయారు చేస్తున్నారని, ఇద్దరు సమర్థవంతమైన మంత్రులు మన జిల్లాలో ఉండడం మనందరి అదృష్టంగా చెప్పారు. 300 సంవత్సరాల పూర్వం ఉదయగిరి నవాబులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వైద్యురాలిగా ప్రసిద్దిగాంచి దేవతగా కొలవబడుతున్న పేరంటాళ్ళమ్మ తల్లికి మహిమాన్విత శక్తులున్నాయని భక్తుల ప్రగాడ విశ్వాసంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 5 వేలకు పైగా ఆలయాలకు ప్రతినెల పదివేల రూపాయలను ధూప దీప నైవేద్యాల కింద అందించడం ఆలయాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా ఎంపీ వేమిరెడ్డి చెప్పారు. మహిళల నమ్మకాలను గౌరవిస్తూ 1.15 కోట్ల రూపాయలు పైగా నిధులు వెచ్చించి వెంకటమ్మ పేరంటాలు ఆలయాన్ని అభివృద్ధి చేయడం చాలా గొప్ప విషయంగా ఆయన అన్నారు.రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగరం రంగనాయకుల పేటలోని వెంకటమ్మ పేరంటాళ్ళమ్మ ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కామన్ గుడ్ ఫండ్స్ ద్వారా ఆలయ అభివృద్ధి కోసం కోసం 1.15 కోట్ల రూపాయలు కేటాయించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిటీ నియోజక వర్గంలో నాలుగు దేవాలయాల్లో అభివృద్ధి పనులకు 23 .95 కోట్లు కేటాయించిన మంత్రి ఆనంకు కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటమ్మ పేరంటాలు ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మహిళలు అమ్మవారి ఆలయానికి అధికంగా వస్తూ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని, ఎంతో పవిత్రమైన ఈ చిన్నపాటి ఆలయానికి రూ. 1.15 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం భక్తుల నమ్మకాల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవంగా మంత్రి చెప్పారు. 9 నెలల్లో ఆలయ రాజగోపురం, మహా మండపం, మఠపళ్లి, అర్చక స్వామి నివాసం నిర్మాణాలను పూర్తిచేసేలా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మంత్రి నారాయణ, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గాల్లోని పురాతన ఆలయాల పునర్నిర్మాణం చేపట్టి నగరానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నట్లు మంత్రి చెప్పారు. మంత్రి నారాయణ గారి సూచన మేరకు రంగనాయకులపేటలోని చౌల్ట్రీ స్థలం నుంచి వెనుక వైపు ఉన్న పార్కుకు రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు దేవాదాయ శాఖ నుంచి అనుమతులు ఇచ్చామని, రోడ్డు పనులు కూడా మొదలైనట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖను ప్రక్షాళన చేస్తూ ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి చెప్పారు.తొలుత ఆలయానికి విచ్చేసిన మంత్రులు, ఎంపీకి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని, మహిళలు ప్రత్యేకంగా నిర్వహించిన కుంకుమార్చన పూజల్లో మంత్రులు, ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ , జిల్లా దేవాదాయ శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *