

- అవగాహన కల్పించిన జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి (పివో) జాగరపు విజయ..
శంఖవరం మన న్యూస్ (అపురూప్) బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కిశోరి వికాసం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని,విద్య, నైపుణ్యం, ఎదుగుదల, పోటీతత్వం, వ్యక్తిగత శుభ్రత వంటి 12 అంశాలపై బాలికలకు అవగాహన కల్పించడం జరుగుతుందని కాకినాడ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి (పివో) జాగరపు విజయ తెలిపారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెద్ద మల్లాపురం గ్రామంలో సచివాలయం నందు కిషోర్ వికాసం కార్యక్రమం లో భాగంగా కాకినాడ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి (పివో) జాగరపు విజయ బాల్యవివాహాలు నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,మే 2వ తేదీన బాలికల సమష్టి పరిచయం, మే 6న తేదీన రుతుక్రమ, పరిశుభ్రత, నిర్వహణ, లైంగిక విద్య , మే 9వ తేదీన బాల్యవివాహం, పునరుత్పత్తి, ఆరోగ్యం, మే 13వ తేదీన బాలల హక్కులు, రక్షణ, పోక్సో చట్టం,మే 16వ తేదీన కౌమార దశలో ఇనుము లోపం, రక్తహీనత, మే 20వ తేదీన లింగ అసమానతమే 23వ తేదీన విద్య, కెరీర్, మార్గదర్శకత్వం, నైపుణ్యాల ప్రాముఖ్యం, మే 27వ తేదీన తేదీన సైబర్ మోసాలు, ఆన్‌లైన్ భద్రత, సమస్యలు, మే 30వ తేదీన ఆర్థిక నిర్వహణజూన్ 3వ తేదీన కౌమార బాలికల నాయకత్వం, సాధికారత, జూన్ 6వ తేదీన శారీరక వ్యాయామం, క్రీడలు, ఆటలు ప్రాముఖ్యం, జూన్ 10వ బాల్య వివాహంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వేసవి సెలవులు వినియోగించుకోనేలా మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వార్డు, గ్రామ సచివాలయాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారని అన్నారు. 15 నుంచి 18 ఏళ్ల లోపున్న బాలికలు, 11 నుంచి 14 ఏళ్లలోపున్న డ్రాపౌట్స్‌ను గుర్తించి వారికి అవగహన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉన్నతాధికారులు జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి దీనికి సంబంధించిన బాధ్యతలు అప్పగించడం జరిగింది అని అన్నారు. మహిళా పోలీసు కన్వీనర్‌గా, డబ్ల్యూసీడీగా అంగన్‌వాడీ టీచర్, వైద్యంలో ఎంపీహెచ్‌వో, ఏఎన్‌ఎం కీలకంగా వ్యవహరించనున్నారని తెలిపారు. సభ్యులుగా గ్రామ, వార్డు సచివాలయాల అడ్మిన్ కార్యదర్శి, వీఆర్వో, డీఆర్‌డీఏ, మెప్మా, విద్య, పోలీస్, ఇంటర్ బోర్డు, ఎస్‌ఎస్‌ఏ, స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ల సిబ్బంది వ్యవహరిస్తారన్నారు. అంగన్వాడి ఉద్యోగులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, ముఖ్యంగా 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలికలు ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయంపై ప్రతిరోజూ ప్రత్యేక శిక్షణ విద్యార్థినిలకు ఇస్తున్నట్లుగా తెలియజేశారు. విద్యార్థులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ తో పాటు విద్యపై అవగాహన, నేటి కాలంలో నడుచుకునే విధానం, సమస్యలు వస్తే పరిష్కరణ వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని కాకినాడ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారి (పివో) జాగరపు విజయ తెలియజేశారు. అనంతరం అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ కౌమార బాలికలతో పరిచయాలు నిర్వహించి, భవిష్యత్తులో వారు చేరుకునే ఉన్నత లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ శంఖవరం సెక్టర్ సూపర్వైజర్లు అరుణశ్రీ, రజని, పెద్ద మల్లాపురం సచివాలయ గ్రామ పోలీస్ జర్థ నాగమణి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు భారీ సంఖ్యలో గ్రామ కౌమార బాలికలు పాల్గొన్నారు.