

రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్
మనన్యూస్,తిరుపతి:గత వైసిపి హాయంలో టిడిఆర్ బాండ్ల జారీలో జరిగిన తీరుపై నగరపాలక సంస్థ కమిషనర్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే భూ బాధితులు తమ సమస్యలతో అధికారులు ముందు ఏ కరువు పెడుతుంటే ఇందుకు కారణమైన వారు పగటిపూట డ్రామాలు వేసుకొని ప్రజల దృష్టిని మరచాలని చూడటం అత్యంత బాధాకరమని రాష్ట్ర యాదవ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ అన్నారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని, ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తిరుపతి నగరాన్ని ఎంతో దూర దృష్టితో ఆలోచించి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని, గత వైసిపి హాయంలో ప్రజలకు రాష్ట్రవ్యాప్తంగా నరకాన్ని చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి శ్రీవారి నిధులను దోచుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తిరుపతికి పచ్చదనాన్ని అందిస్తున్న చెట్లను డబుల్ డెక్కర్ బస్సులు తీసుకువచ్చి నాశనం చేశారన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల నాణ్యత పై విచారణ జరుగుతుందన్నారు. వీధి నాటకాలతో ప్రజలు హర్షించరని, తమ పాలనలో లోటుపాట్లు ఉంటే తమకు తెలపాలని సూచించారు. 320 కోట్ల తుడా నిధులు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బలహీనవర్గాలకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని, అబద్ధాలు చెప్పి నాటకాలు చేస్తున్నవారికి ఇప్పటికే ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ మాట్లాడుతూ శ్రీవారి దర్శనాలపై భూమన కరుణాకర్ రెడ్డి చర్చకు రావాలన్నారు. కొంతమంది కార్పొరేటర్లు వందల కోట్లకు ఎలా పడగలెత్తారో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, జగన్నాథం, కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, సుబ్బు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
