

మనన్యూస్,నారాయణ పేట:కృష్ణానది పరివాహక ప్రాంతమైన మక్తల్ నియోజకవర్గంలో రబీ సీజన్ కు సంబంధించిన వరి పంట కోతలు ఇప్పటికే విరివిగా కొనసాగుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే వరి కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు రైతుల నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాజీ ఎంపిటిసి జి.బలరాం రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు, ప్రస్తుత రబీ సీజన్లో మక్తల్ నియోజకవర్గం లోని మక్తల్, కృష్ణ, మాగనూరు, నర్వ, అమరచింత, ఆత్మకూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయడం జరిగిందన్నారు. వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు వరి ధాన్యం కొనుగోలుకు బోనస్ అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత వానకాలం సీజన్లో పంట కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటివరకు రైతులకు బోనస్ డబ్బులు అందజేయలేదని ఆయన అన్నారు. తక్షణమే బోనస్ కు సంబంధించిన నగదును రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
