

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తి కేవీబీపురం మండలం అంజూరుపాలెం కులదురహంకార ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన ఆ మండలంలో వెలుగు చూసింది.తమపై అధికారులకు ఫిర్యాదు చేశాడనే అక్కస్సుతో మఠం పంచాయతీ మాజీ దళిత సర్పంచిపై పెత్తందారులు బుధవారం దాడికి దిగారు.ఈ దాడిలో మాజీ సర్పంచి వెంకటయ్యతో పాటు ఆయన భార్య పెంచలమ్మలకు గాయాలయ్యాయి.వీరిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.కేవీబీపురం మండలం మఠం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కలపాటి వెంకటయ్యకు ఎంఏ రాజులకండ్రిగ రెవెన్యూలోని సర్వే నెంబర్ 428/2లో 1.39 ఎకరాల ప్రభుత్వ దరఖాస్తు భూమి ఉంది. ఆ భూమిపై తన తల్లి పెంచలమ్మకు పట్టా కూడా ఉంది.అయితే ఆ పొలానికి పక్కనే ఉన్న గల్లా సుదర్శన్ కుటుంబంతో వెంకటయ్య కు భూ వివాదం నడుస్తోంది.ఈ నేపథ్యంలో గతంలో జరిగిన దాడి ఘటనలో గల్లా సుదర్శన్ కుటుంబంపై అట్రాసిటీ కేసు కూడా నడుస్తోంది.అయినా సుదర్శన్ కుటుంబం వెంకటయ్య కుటుంబాన్ని భూమిలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటుండంతో చివరకు కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు.అయినా సుదర్శన్ కుటుంబం వెంకటయ్యను అడుగడుగునా అడ్డుకుంటుండడంతో ఈనెల 4వ తేదీన వెంకటయ్య సిపిఎం నాయకులతో కలిసి కేవీబీపురం తహశీల్దారుకు సుదర్శన్ కుటుంబంపై ఫిర్యాదు చేశారు.ఇది మనసులో పెట్టుకున్న సుదర్శన్ కుటుంబం బుధవారం ఉదయం పొలం వద్దకు వచ్చిన వెంకటయ్య దంపతులను కులం పేరుతో దూషించి దాడి చేశారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేవీబీపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.పెత్తందార్లను అరెస్టు చెయ్యాలి:కేవీపీఎస్పె త్తందార్ల దాడిలో గాయపడి స్థానిక శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మఠం మాజీ సర్పంచ్ వెంకటయ్య దంపతులను శ్రీకాళహస్తి ప్రాంత కెవిపిఎస్ నాయకులు పరామర్శించారు.దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఇది ముమ్మాటికీ కుల దురహంకార ఘటనేనని ఉద్ఘాటించారు.బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నాయకులు అంగేరి పుల్లయ్య, గంధం మణి, పెనగడం గురవయ్య, గెడి వేణు,వెంకటేష్,ఎస్ఎఫ్ఐ గురవయ్య తదితరులు పాల్గొన్నారు.