టీడీపి మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా తొలి రోజే నామినేషన్ దాఖలు

మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారమే లక్ష్యమని వెల్లడి

కలిగిరి, నవంబర్ 15: మన ధ్యాస ప్రతినిధి శ్రీకాంత్ కుట్టుబోయిన

కలిగిరి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే నాగసముద్రం పంచాయతీలో ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు చీమల రాధాకృష్ణ సతీమణి చీమల దొరసాని, టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి ర్యాలీగా వెళ్లిన ఆమె, ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి. ప్రమోద్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అనంతరం చీమల దొరసాని మీడియాతో మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు.ముఖ్యంగా నాగసముద్రం పంచాయతీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు, అంతర్గత సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని, గ్రామస్తులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధిని కాంక్షించే ప్రజలందరూ తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ ఏఎంసీ వైస్ చైర్మన్ చీమల తాతయ్య, నాగసముద్రం పంచాయతీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని చీమల దొరసానికి తమ మద్దతు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *