రేణిగుంట మండలంలో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం..

​రేణిగుంట, నవంబర్ 13 ): అక్షర సమాజం పుట్టిన నాటి నుండి గ్రంథాలు జీవన వికాసానికి, సామాజిక పురోభివృద్ధికి సోపానాలుగా మానవ పరిణామాన్ని ఆవిష్కరిస్తున్నాయని, గ్రంథాలయాలు ఆ లక్ష్యాలను మరింత విస్తరిస్తూ వివేకవంతమైన తరాన్ని రూపొందించడంలో అవిశ్రాంత కృషిని కొనసాగిస్తున్నాయని రేణిగుంట మండల గ్రంథాలయ అధికారిణి నాగరాణి తెలిపారు. గ్రంథాలయాలు అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయడం, నేటి తరాన్ని గ్రంథాలయాలకు సన్నిహితం చేయడమే ధ్యేయంగా పౌరగ్రంథాలయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

​నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల సందర్భంగా రేణిగుంట మండల గ్రంథాలయంలో పలు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. స్థానిక ప్రజలు, విద్యార్థులు, యువకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

​వారం రోజుల పాటు జరిగే కార్యాచరణ వివరాలు:

నవంబర్ 14 (శనివారం): గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ వేడుకలు మరియు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది.నవంబర్ 15 (ఆదివారం): గ్రంథాలయంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడంతో పాటు, విద్యార్థులకు మరియు ప్రజలకు పుస్తక పఠన ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారు.నవంబర్ 16 (సోమవారం): గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖులు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్, పాతూరి నాగభూషణం, వి.ఎన్.జి. వెంకటరమణయ్య తదితరులను స్మరించుకుంటూ ప్రత్యేక సభలు నిర్వహిస్తారు. నవంబర్ 17 (మంగళవారం): సాహితీ ప్రియుల కోసం కవిసమ్మేళనాలు, సెమినార్లు నిర్వహించి ప్రముఖ రచయితల సందేశాలను చదివి వినిపిస్తారు.

నవంబర్ 18 (బుధవారం): పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ మరియు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించబడతాయి.

నవంబర్ 19 (గురువారం): మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించి, సమాజంలో మహిళల చైతన్యంపై చర్చలు చేపడతారు.

నవంబర్ 20 (శుక్రవారం): వారం రోజుల పాటు అత్యంత వైభవంగాసాగిన జాతీయ గ్రంథాలయ వారోత్సవముల ముగింపు వేడుకలు ముగియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *