

మనన్యూస్:తిరుపతి,స్థానిక చిన్నబజారు వీధిలోని గాలిగోపుర మఠాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈఓ మునికృష్ణ మూర్తి ఎమ్మెల్యేకి స్వాగతం పలికి మఠం ఆవరణలోని శ్రీకృష్ణని ఆలయంలో పూజలు నిర్వహించారు. పూజారులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఆశ్వీరదించారు. అనంతరం మఠం ఆవరణను పరిశీలించారు. వర్షాకాలంలో భవనం లీకేజి ల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఈఓ ఎమ్మెల్యేకు వివరించారు. కోటి రూపాయలతో మఠంలో మరమ్మత్తులు చేయించాలన్న ప్రతిపాదనలు రెండేళ్ళుగా పెండింగ్ లో ఉన్నట్లు ఈఓ ఎమ్మెల్యేకి వివరించారు.క్రీస్తుశకం 1413 లో స్థాపించిన గాలిగోపుర మఠం చరిత్ర ఘనమైనదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. దేవాదాయ శాఖ ఆధీనంలో నడుస్తున్న ఈ మఠం మరమ్మత్తులకు కోటి రూపాయలు టిటిడి అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా అన్నమయ్య విగ్రహానికి శాంట క్లాస్ టోపీ పెట్టడం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఆకతాయల పనిని ఏదో పెద్ద అపచారం జరిగిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి రాద్దాంతం చేయడం తగదని ఆయన అన్నారు. గత ఐదేళ్ళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో దేవాలయాల్లో జరగని అపచారం లేదని ఆయన అన్నారు. రథాలు తగలబెట్టడం, దేవుడి విగ్రహాల తలలు తెగ్గొటడం వంటివి లెక్కలేనన్ని జరిగాయన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ కరుణాకర్ రెడ్డి ఛైర్మన్ గా ఉండగానే జరిగిందని ఆయన చెప్పారు. కరుణాకర్ రెడ్డి సనాతన ధర్మంపై మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు సనాతన ధర్మం కాపాడటానికి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి, ఆర్కాట్ కృష్ణప్రసాద్, దినేష్ జైన్, ఆముదాల వెంకటేష్, వినోద్, మావిళ్ళ సుధాకర్, టిడిపి నాయకులు ఆముదాల తులసి రామ్, జయకుమార్, చుక్కల దాము, రవి శంకర్ యాదవ్, బిజేపి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.