రేణిగుంట ఆగష్టు 2:
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా సహించేది లేదని, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (సీఐ) జయచంద్ర హెచ్చరించారు.
స్థానిక రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) శ్రీనివాసులు మరియు పోలీస్ సిబ్బందితో కలిసి మండల పరిధిలోని రౌడీషీటర్లు, అనుమానితులకు (సస్పెక్ట్స్) కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ, పాత నేరస్థులు మరియు రౌడీషీటర్లు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు. గతంలో చేసిన తప్పులను పక్కనబెట్టి, కుటుంబంతో కలిసి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని, మళ్లీ నేరాల బాట పడితే కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. మండల పరిధిలోని రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్కు వచ్చి హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించారు.
దందాలు, భూ తగాదాలు, సెటిల్మెంట్లు, ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే తక్షణమే అరెస్టు చేసి కఠిన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అయితే, ఎవరైతే తమ ప్రవర్తనను పూర్తిగా మార్చుకుని మంచి నడవడికతో ఉంటారో, వారిపై ఉన్న రౌడీషీట్లు మరియు సస్పెక్ట్ షీట్లను ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ వెల్లడించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది మరియు పలువురు రౌడీషీటర్లు, అనుమానితులు పాల్గొన్నారు.
