
తవణంపల్లి జూలై 24 మన ద్యాస (నాగరాజ సరకింటి)
ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి, నేరాల నివారణే లక్ష్యంగా నిర్వహిస్తున్న పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ నాయుడు, తవణంపల్లి ఎస్‌ఐ రమేష్ బాబు మరియు పోలీసు సిబ్బంది కలిసి నల్లి శెట్టిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త గొల్లపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోకూడదని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
అలాగే బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు ఫోక్సొ చట్టం గురించి వివరిస్తూ, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు వంటి ఘటనలను అరికట్టేందుకు ఈ చట్టం అమల్లో ఉందని, చిన్నారుల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు.
అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.
గ్రామ ప్రజలు పోలీసులతో సమన్వయంతో పనిచేసి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసు అధికారులు అందించిన సూచనలను ఆసక్తిగా విన్నారు.