మన ధ్యాస, నెల్లూరు, జూలై 19 : నెల్లూరులో అదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఏపీ ఎంఎఫ్ జిల్లా మహాసభల్లో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మంత్రికి ఫౌండర్ దిల్లిబాబురెడ్డి, సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా సమాజానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు.జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందన్నారు.గతంలో ఉన్న అక్రిడిటేషన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ వివక్ష లేకుండా కొత్త అక్రిడిటేషన్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ స్కీమ్ కింద నిరంతరాయ నగదు రహిత వైద్యం, అర్హులైన వారికి ఇళ్లు లేదా ఇంటి స్థలాల కేటాయింపును ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు. నిజాయితీ, సామాజిక బాధ్యతతో ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం-మీడియా కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నెల్లూరు జిల్లా ఏపీఎంఎఫ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,కమిషనర్ నందన్,జర్నలిస్ట్ యూనియన్ నేతలు నరసింహులు,మల్లికార్జున,వెంకట్ నారాయణ,రఫీ తదితరులు పాల్గొన్నారు.




