రేణిగుంట జూన్ 4.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్. ఆదేశాల మేరకు, రేణిగుంట సబ్ డివిజన్ పోలీస్ అధికారి డిఎస్పీ) వై.శ్రీనివాసరావు సూచనలతో ఈ దినము రేణిగుంట మండల పరిధిలోని పాఠశాలల యాజమాన్యాల అందరినీ పిలిపించి ఒక ప్రత్యేక అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో రేణిగుంట పోలీస్ స్టేషన్ ఎస్సై ధర్మారెడ్డి , గాజులమండ్యం పోలీస్ స్టేషన్ ఎస్సై హరీష, ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీకాంత్ రేణిగుంట డివిజనల్ పరిధిలోని ఎస్ఐలు కూడా పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులతో మసలుకునే విధానం మరియు పాఠశాల బస్సుల నిర్వహణకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలపై రేణిగుంట అర్బన్ సిఐ చంద్ర పాఠశాలల ప్రతినిధులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి ఒక్క పాఠశాల బస్సుకు సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, అలాగే వాటికి సంబంధించిన రికార్డులను ఖచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలి. పాఠశాల బస్సులను ఖచ్చితంగా సరైన స్థితిలో ఉండేలా చూసుకోవాలి. బస్సుకు ఉండే డ్రైవర్‌కు ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా, పిల్లలతో ఎంతో పద్ధతిగా నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. పాఠశాల పిల్లలను బస్సు ఎక్కించుకునేటప్పుడు మరియు దించుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, రోడ్డు దాటించే విషయంలో వారికి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
దీనితో పాటు పాఠశాలల పరిసరాలలో ఉన్న కిరాణా షాపులలో పిల్లలకు ఎలాంటి మత్తు పదార్థాలు అందుబాటులో లేకుండా చూడాలని, వాటిని నియంత్రించడం కొరకు తగిన సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని యాజమాన్యాలను కోరారు. విద్యార్థుల పట్ల ఏ ఉపాధ్యాయుడు గానీ, మరెవరైనా సరే అసభ్యకరంగా ప్రవర్తించకుండా ఉండేలా చూసేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి వారి తల్లిదండ్రులతో పరస్పర చర్చలు జరపాలని సూచించారు. అలాగే విద్యార్థులతో కూడా నేరుగా మాట్లాడి, అటువంటిది ఏదైనా ఉంటే తక్షణమే వాటిని నిర్మూలించే విధంగా పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలపై ఎక్కువగా అకృత్యాలు జరుగుతున్నాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసుల తరఫున ఈ దినము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సిఐ చంద్ర తెలిపారు. పాఠశాలల్లో పిల్లలకు ఉపాధ్యాయుల ద్వారా ‘మంచి స్పర్శ – చెడు స్పర్శ’ (గుడ్ టచ్ – బ్యాడ్ టచ్) అనే అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని చెప్పారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే దానిని తల్లిదండ్రులకు లేదా అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులకు తెలియపరిచేలా పిల్లలను సిద్ధం చేయాలని, తద్వారా అటువంటి అకృత్యాలను నివారించే మార్గాలను చేపట్టాలని కోరారు.
ఈ సమావేశానికి రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు, రేణిగుంట పోలీస్ స్టేషన్, గాజులమండ్యం పోలీస్ స్టేషన్, ఏర్పేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలల యాజమాన్యాల అందరూ హాజరయ్యారు. ఇంతటి ముఖ్యమైన సమావేశానికి అందరూ హాజరు కావడం నిజంగా ఎంతో సంతోషంగా ఉందని సిఐ పేర్కొన్నారు. పిల్లలకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, వారిలో క్రమశిక్షణను పెంచి సమాజంలో వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే విధంగా పాఠశాలల యాజమాన్యాలు పోలీసులకు సహకరించాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
