రేణిగుంట జూన్ 4.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో జూన్ 4వ తేదీన అత్యంత వైభవంగా ప్రారంభమైంది. “ఆడనదే ఆట.. పాడనదే పాట” అన్న చందంగా, అంగరంగ వైభవంగా, ఒక విద్యా మహోత్సవంలా ఈ కార్యక్రమం జరిగింది. పండుగ వాతావరణాన్ని తలపించిన ఈ వేడుకలో విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
​తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి కె.వి.ఎన్. కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో డీవైఈఓ ఇందిరా దేవి, ఎం.పి.డి.ఓ. రవిచంద్ర, పట్టణ ఎస్.ఐ. ధర్మారెడ్డి, మండల విద్యాశాఖాధికారి రంగనాథయ్య, పట్టణ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా, క్లస్టర్ ఇన్‌చార్జ్ పుష్పనాథ్, ప్రజాప్రతినిధులు, మండల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి మరియు పట్టణ ప్రెసిడెంట్ తమ ప్రసంగంలో… పాఠశాల విద్యాశాఖ మరియు ప్రభుత్వ బడుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను కొనియాడారు. నవతరం వైతాళికుడు, యువకుడు అయిన మన విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషిని వారు వేనోళ్ల శ్లాఘించారు.
​కార్యక్రమంలో భాగంగా మండలంలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు, 11 ఉన్నత పాఠశాలల్లో టాప్ స్థానాల్లో నిలిచిన మొత్తం 38 మంది విద్యార్థులకు, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలందరికీ మెమొنتోలు, సర్టిఫికెట్లు, శాలువాలు మరియు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుత్తివారిపల్లికి చెందిన విద్యార్థిని జి. రేష్మ జపాన్ దేశ పర్యటనకు ఎంపిక కావడం అత్యంత హర్షనీయమని పేర్కొన్నారు.
​సభ అనంతరం ‘బడి పిలుస్తోంది’ ప్రచార రథం ముందు ‘జయ జయ’ ధ్వనాలతో, మేళతాళాల వైభవంతో భారీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా విద్యా పాలనా యంత్రాంగం, ఎం.పి.డి.ఓ., ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు, పట్టణ ప్రజలు, మండల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి ‘సమైక్య రథం’లా కదులుతూ ర్యాలీ నిర్వహించి, అనంతరం మానవహారం ద్వారా ప్రభుత్వ బడుల ప్రతిభను చాటిచెప్పారు.
​రేణిగుంట మండల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను మరియు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో కూడిన కరపత్రాలను ఈ సందర్భంగా అందరికీ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల విశిష్టతను గుర్తించిన పలువురు తల్లిదండ్రులు, ఈ కార్యక్రమ స్ఫూర్తితో ప్రైవేట్ పాఠశాలల నుండి సుమారు 20 మంది పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించడంతో ఈ విద్యా మహోత్సవం ఘనంగా ముగిసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed