- స్వీయ గణన ప్రక్రియ 100 శాతం అయ్యేలా దృష్టి సారించాలి
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(కలెక్టర్ కార్యాలయం) ఏప్రిల్ 29: జనగణన-2027 ప్రక్రియను సమర్థవంతంగా,సమగ్రంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు అంశాలపై సూచనలు చేశారు.మార్చి16నుంచి ప్రారంభమైన స్వీయ గణన ప్రక్రియ జిల్లాలో ఇప్పటివరకు 86.49 శాతం మాత్రమే పూర్తయిందని గుర్తుచేస్తూ,ఇది 100 శాతానికి చేరుకోవాల్సిందిగా అభిప్రాయపడ్డారు.ఇక నుంచి ప్రతి రోజూ జనగణన పురోగతిని ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి పర్యవేక్షించాలని,అదనపు సెన్సస్ అధికారి కూడా సమన్వయంతో బాధ్యత వహించాలని సూచించారు.మే1నుంచి ప్రారంభమయ్యే జనగణన-2027ప్రధాన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ సమన్వయం వహించాలని పేర్కొన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో హాజరు కావాలని,అవసరం లేని సిబ్బందిని తీసుకురావద్దని స్పష్టం చేశారు. జనగణనకు సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,శిక్షణ,ఛార్జ్,స్పెషల్ ఛార్జ్ అధికారుల నియామకంపై సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. సెన్సస్ కోసం ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసి,ప్రతిరోజూ సమాచారాన్ని, నివేదికలను అప్డేట్ చేయాలని సూచించారు.జిల్లాలోని ప్రజాప్రతినిధులు,అధికారులు, ప్రముఖుల స్వీయ గణన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.గురువారం ఉపాధి హామీ కార్మికులు,పోలీసు శాఖ సిబ్బంది,ఇతర ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా స్వీయ గణనలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో స్వీయ గణన ఎంతవరకు పూర్తయ్యిందో వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.అన్ని వర్గాల ప్రజలు,స్వయం సహాయక సంఘాల సభ్యులు, కార్మికులు,ఇతర పౌరులతో ప్రత్యేక స్వీయ గణన డ్రైవ్ నిర్వహించి,ప్రతి ఒక్కరూ జనగణనలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలని చెప్పారు.ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమ కిట్లు,మొబైల్ అప్లికేషన్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సంసిద్ధం చేయాలని ఆదేశించారు.రెవెన్యూ,జీవీఎంసీ అధికారులు సమన్వయంతో పని చేసి జనగణన ప్రక్రియను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. జనగణన విధుల్లో ఎవరికి మినహాయింపు లేదని,సిఫార్సులకు తావులేదని స్పష్టం చేసిన కలెక్టర్,విశాఖపట్నం అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి,డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు,జీవీఎంసీ అదనపు కమిషనర్లు రమణమూర్తి,ఆర్డీవోలు,సీపీవో శ్రీనివాసరావు,జోనల్ కమిషనర్లు,తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.