ఎల్ బి నగర్ మన ధ్యాస:-
రంగారెడ్డి జిల్లా మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదం చేసే దిశగా జన శిక్షణా సంస్థాన్ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 నెలలపాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మంగళవారం పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు 40 మంది లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. సంస్థ డైరెక్టర్ రామ్మోహన్, కాలనీ అధ్యక్షులు యాదయ్య , ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి కలిసి మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి మహిళ ఎవరిపైన ఆధారపడకుండా స్వయంగా నిలబడి, కుటుంబానికి తోడ్పాటు అందించే స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించి, ఉపాధి అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ స్వప్న ,సెంటర్ ఇంచార్జి విజయలక్ష్మి , కాలనీ కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ రెడ్డి , చంద్రారెడ్డి , భాస్కరాచారి మహిళా శక్తి కన్వీనర్ అర్చనా నవీన్ పాల్గొన్నారు.