పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు… కేంద్ర నిర్ణయానికి కూటమి ప్రభుత్వం స్వాగతం
అమరావతి, మార్చి 27:మన న్యూస్ ప్రతినిధి(నాగరాజు కె ).
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలపై భారం తగ్గించేలా ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమ నిబద్ధతకు, దూరదృష్టి నాయకత్వానికి స్పష్టమైన నిదర్శనమని కొనియాడారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల ఒత్తిడి పెరుగుతున్న సమయంలో అనేక దేశాలు ఆ భారం ప్రజలపై మోపుతున్నప్పటికీ, భారత్ మాత్రం ప్రజా ప్రయోజనాలను ముందుంచి ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకోవడం ఎన్డీయే ప్రభుత్వ ప్రజాకేంద్రిత పాలనను ప్రతిబింబిస్తోందన్నారు. సవాళ్ల సమయంలో నాయకత్వం అసలైన శక్తి బయటపడుతుందని, అలాంటి సందర్భాల్లో మోదీ గారి నిర్ణయాలు దేశానికి స్థిరత్వం, విశ్వాసం తీసుకువస్తున్నాయని పల్లా పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని పల్లా ప్రశంసిస్తూ, ప్రజల సంక్షేమం మరియు ఆర్థిక సమతుల్యతను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లగల దూరదృష్టి, పరిపాలనా అనుభవం ఆయనదేనన్నారు. కేంద్రం తీసుకున్న ప్రజా అనుకూల నిర్ణయాలను వెంటనే స్వాగతిస్తూ, రాష్ట్ర ప్రజలకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా స్పందించడం చంద్రబాబు సమర్థ నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో ప్రజలపై భారం తగ్గిస్తూ, అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం నిజమైన ప్రజా ప్రభుత్వమని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే ఎన్డీయే ప్రభుత్వ పరిపాలన దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.