మన ధ్యాస ప్రతినిథి కాకినాడ;రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యుజేఎఫ్) ఆధ్వర్యంలో మార్చి 4న జరగనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్ లు పిలుపునిచ్చారు.రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందని వారు తెలిపారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం కాకినాడ యుటిఎఫ్ హోమ్ లో జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతోపాటు మాజీ అధ్యక్షుడు అధ్యక్షులు అలుమల్లు ఏలియా మాట్లాడుతూ మార్చి 4న విజయవాడలో జర్నలిస్టుల సమస్యలపై పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అందరూ హాజరై సమస్యల పరిష్కారానికి కదం తొక్కాలని పిలుపునిచ్చారు.గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించుకునేందుకు రుణాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.జర్నలిస్టులపై దాడులను నివారించేందుకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో 18 రాష్ట్రాలలో జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం ఉందని, తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు,వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించాలన్నారు. జర్నలిస్టుల పిల్లలకు ఇప్పటికే 50 శాతం ఫీజు రాయితీ పలు ప్రాంతాలలో సక్రమంగా అమలు కావడం లేదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేటు విద్యాసంస్థలలో ఉచిత విద్యను అందించేందుకు కృషి చేయాలని కోరారు. గతంలో ఇచ్చిన రైల్వే పాసులను పునరుద్ధరించాలని, కార్మిక భీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం చలో విజయవాడ కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ టి.పృథ్వీరాజ్,జిల్లా కమిటీ సభ్యులు వి నానాజీ,సత్య,పుర్రె త్రినాథ్,సురేంద్ర బాబు,కె.సత్యనారాయణ(సత్య) మల్లేశ్వరరావు, మణికంఠ, ప్రవీణ్, లోవరాజు తాతాజీ, హసేన్, కరుణాకర్, జోజిబాబు, స్టాలిన్, రమణ, రాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *