సమిష్టిగా అభివృద్ధి సాధిద్దాం: కలిగిరి మండలంలో గ్రామ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్
పార్టీ బలోపేతం గ్రామాల పురోగతి: కలిగిరి మండలంలో టిడిపి గ్రామ కమిటీల ఏర్పాటు
గ్రామ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం-ఎమ్మెల్యే కాకర్ల సురేష్
కలిగిరి, నవంబర్ 28,మన ధ్యాస ప్రతినిధి (నాగరాజు):

కలిగిరి మండల పరిధిలోని పలు పంచాయతీలలో నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశాల్లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని గ్రామాల అభివృద్ధి, పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా ముందుకు రావాలనే పిలుపును ఆయన అందించారు. అభివృద్ధి పథంలో గ్రామాలు దూసుకెళ్లాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.శుక్రవారం నాడు కలిగిరి మండలంలోని కావలి ముస్తాపురం, లక్ష్మీపురం పంచాయతీలలో టిడిపి గ్రామ కమిటీల ఏర్పాటు కోసం జరిగిన సమావేశాలకు కాకర్ల సురేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమములో ముందుగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి నిస్వార్థంగా పనిచేసిన బూత్ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలు, గ్రామ నాయకులు, అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న నాయకులను ఎమ్మెల్యే స్వయంగా అభినందించారు. వారి సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.తదుపరి గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా భూసంబంధిత సమస్యలు,గ్రామంలో మౌలిక వసతుల గురించి,సీసీ రోడ్ల అవసరం,తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వంటి విషయాలను గ్రామ ప్రజలు వివరించారు.వాటిని శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే ఈ సమస్యల పరిష్కారానికి అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేస్తామని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన తెలిపారు. అనంతరం టిడిపి మండల నాయకులు, గ్రామ నాయకుల సమక్షంలో ప్రతి పంచాయతీలో గ్రామ కమిటీలను సక్రమంగా ఎంపిక చేసి ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతం కోసం బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.

అనంతరం అదే గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలును గమనించేందుకు భాగంగా, ప్రతి రైతు కుటుంబంతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు గురించి తెలుసుకున్నారు.ప్రత్యేకంగా, అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడతగా 7 వేల రూపాయల ఆర్థిక సహాయం రైతుల ఖాతాల్లో జమయ్యిందా లేదా అన్న విషయంపై ఎమ్మెల్యే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి రైతులను ప్రశ్నిస్తూ వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా గ్రామంలోని అందరూ రైతులు ఏకగ్రీవంగా స్పందిస్తూ తమకు అన్నదాత సుఖీభవ మొత్తం సమయానికి అందిందని, అందిన నిధులు వ్యవసాయ పనుల్లో కొంతమేర ఆర్థిక భరోసాగా నిలిచాయని తెలిపారు.పంట సాగు కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు ఈ సాయం ఎంతో ఉపయుక్తమైందని వారు హర్షం వ్యక్తం చేశారు.రైతుల సమస్యలను శ్రద్ధగా విని, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారులకు సూచిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.రైతుకు అండగా నిలబడటం తనకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతేనని తెలిపారు.గ్రామాభివృద్ధి లక్ష్యంగా తీసుకున్న ఈ కార్యక్రమం ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం–ప్రజలు కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మరోసారి స్పష్టం చేశారు.









