దూబగుంట దుర్ఘటన బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాకర్ల సురేష్..మృతుల కుటుంబానికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున 1లక్ష రూపాయలు ఆర్థిక సహాయం..గాయపడిన పాపకు కోలుకునే వరకు నెలవారీ 5 వేలు సహాయం — ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కలిగిరి,దూబగుంట అక్టోబర్ 25 :(మన ధ్యాస న్యూస్)://

ఇటీవల జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి చవలమూడి మేఘనను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పరామర్శించారు. శనివారం రాత్రి ఆయన స్వయంగా మేఘన స్వగ్రామమైన కలిగిరి మండలం, దూబగుంట గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఆమె నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, మేఘన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ దుర్ఘటనలో దూబగుంట గ్రామానికి చెందిన చవలమూడి బాబు (34), మమత (27), మరియు వారి కుమార్తె వైభ (8) దురదృష్టవశాత్తు ఘటన స్థలంలోనే మృతి చెందగా, మరో కుమార్తె మేఘన తీవ్రంగా గాయపడి నెల్లూరు లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యులు ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిందని వెల్లడించగా, ప్రస్తుతం గ్రామానికి తీసుకువచ్చి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటోంది.ఈ విషయం తెలిసిన వెంటనే, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వ్యక్తిగతంగా అక్కడికి వెళ్లి పాపను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ, ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబానికి తగిన ఆర్థిక భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం,అందజేస్తున్నట్టు, అలాగే పాప పూర్తిగా కోలుకునే వరకు ప్రతి నెలా రూ.5,000 సహాయం అందజేస్తామని తెలిపారు.అంతేకాకుండా ప్రమాదానికి కారణమైన బోర్ వెల్స్ లారీ యజమాని ద్వారా ఇన్సూరెన్స్ క్లైమ్ ప్రాసెస్ చేసి, కుటుంబానికి తగిన పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాప మేఘనను జాగ్రత్తగా చూసుకోవాలని బంధువులకు సూచిస్తూ, ఆమె ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.









