- మండల వైద్యాధికారి ఎస్ ఎస్ రాజీవ్ కుమార్ పిలుపు…
శంఖవరం, మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): ఆంధ్ర ప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్స్ అసోసియేషన్ ( ఏపిపిహెచ్సి డిఏ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు తమ హక్కుల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీ నుంచి దశల వారీగా నిరసనలు కొనసాగనున్నాయి. అసోసియేషన్ తరఫున విడుదల చేసిన ప్రకటనలో వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ – ఈ ఆందోళనతో కొంత అసౌకర్యం కలిగినా, అది ప్రజల వ్యతిరేకంగా కాదని, గ్రామీణ వైద్య సేవల భవిష్యత్తు కాపాడుకునే ఉద్దేశంతోనే ఈ పోరాటం జరుగుతోందని స్పష్టం చేశారు. సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 26న ఆన్లైన్ రిపోర్టింగ్ సేవలు బంద్ చేయబడతాయి. 27న స్వస్థ నారీ కార్యక్రమం, 104 సంచార చికిత్స సేవలు నిలిపివేయబడతాయి. 28న అధికారిక వాట్సాప్ గ్రూప్ బహిష్కరించనున్నారు. 29న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు నిలిపివేయబడతాయి. 30న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబర్ 1న జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైద్యులు విజయవాడలో నిరసనకు దిగుతారు. ఇందులో భాగంగా నాయకులు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. వైద్యుల ప్రధాన డిమాండ్లలో జివో 99 ద్వారా రద్దు చేసిన ఇన్ సర్వీస్ పిజి కోటా పునరుద్ధరణ, సమయానికి ప్రమోషన్లు ఇవ్వడం, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు ట్రైబల్ అలవెన్స్, 104/సంచార చికిత్స సేవలకు ప్రత్యేక అలవెన్స్, నొషనల్ ఇన్క్రిమెంట్ ఇవ్వడం ఉన్నాయి. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ ఎస్ ఎస్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య హక్కుల కోసం మేము కట్టుబడి ఉన్నాము. కానీ డాక్టర్లకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లేకపోతే గ్రామీణ వైద్య సేవలు కుంటుపడతాయి. మా డిమాండ్లు న్యాయమైనవే. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలి. మేము ప్రజలకు ఇబ్బంది కలిగించడానికి కాదు, సేవలను మెరుగుపరచడానికి ఈ పోరాటం చేపట్టాము” అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనలకు విస్తృత మద్దతు లభిస్తుందని వైద్యుల సంఘం నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో ఈ ఉద్యమం విజయవంతం కావాలని కోరారు.









