

షేక్షానపల్లి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో వ్యవసాయాధికారి వెల్లడి
షేక్షానపల్లి: సాంప్రదాయ డీఏపీ కంటే నానో డీఏపీ వాడకం పంటలకు మరింత ప్రభావవంతంగా, లాభదాయకంగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి బి. రామకృష్ణుడు తెలిపారు. మండల పరిధిలోని షేక్షానుపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం యూరియా, డీఏపీ కొరత ఉన్నందున, రైతులు నానో టెక్నాలజీ ఆధారిత ఎరువులను వినియోగించడం శ్రేయస్కరమన్నారు. ఇఫ్కో నానో డీఏపీ ద్రవరూపంలో ఉండటం వల్ల పంటలు దాని సామర్థ్యాన్ని పూర్తిగా గ్రహించి, పోషకాలను వేగంగా శోషించుకుంటాయని వివరించారు. నానో డీఏపీలో 8.0% నత్రజని (N), 16.0% భాస్వరం (P2O5) ఉంటాయని, ఇది పంటలలో నత్రజని, భాస్వరం లోపాలను సమర్థవంతంగా సరిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా వివిధ పంటలకు ఆశించే తెగుళ్లు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకునే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
రైతులకు కీలక సూచనలు:
- రైతులందరూ ఈ నెల 31వ తేదీలోగా తమ పంటలకు బీమా చేయించుకోవాలని సూచించారు.
- ‘అన్నదాత సుఖీభవ’ పథకంలో 267 మంది రైతుల ఖాతాలు ఎన్‌పీసీఎల్ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నాయని, వారు వెంటనే దాన్ని యాక్టివేట్ చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్కే సిబ్బంది, ఇతర రైతులు పాల్గొన్నారు.