

మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 9 :నెల్లూరు నగరంలో దివంగత ఆనం వివేకానంద రెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర కార్పొరేషన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఓ లేఖ రాశారు. మాజీ శాసనసభ్యులు దివంగత ఆనం వివేకానందరెడ్డి ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం నెల్లూరు ప్రజలకు సేవలు అందించారన్నారు. నెల్లూరు మునిసిపల్ వైస్-చైర్మన్ గా, చైర్మన్ గా, కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా, నెల్లూరు శాసనసభ్యులుగా రెండు సార్లు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా ఒకసారి పనిచేశారన్నారు. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో వారు ప్రజలకు ఏనలేని సేవలు అందించారని వారి కాంస్య విగ్రహం నెల్లూరులో ఏర్పాటు చేయటం అందరి భాద్యతగా భావిస్తున్నామన్నారు.ఇందుకు సంబంధించి, కార్పొరేషన్ తరపున స్థలం కేటాయిస్తే నా స్వంత ఖర్చులతో వారి కాంస్య విగ్రహం ఏర్పాటుకి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆనం వివేకానందరెడ్డి కుటుంబసభ్యులను, ఆనం వివేకానందరెడ్డి అభిమానులు, వారితో సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో ప్రయాణించిన వారిని కలుపుకొని ఈకార్యక్రమం చేపట్టాలని తన ఆకాంక్ష అన్నారు.పొదలకూరు రోడ్డులో పెద్దాస్పిటల్ (GGH) వెనుక భాగంలో ఇప్పటికే ఐ-ల్యాండ్ నిర్మాణం జరిగి ఉందని దానిని మరింత ఆధునీకరించి, కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయింపు చేసినట్లయితే, బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో అంతిమ నిర్ణయం ఆనం వివేకానందరెడ్డి కుటుంబసభ్యులదేనని, మీరు పూర్తి భాద్యత తీసుకొని, వారి కుటుంబసభ్యులతో చర్చించి, అత్యంత వేగవంతంగా స్థల కేటాయింపు చేస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు.
