

మనన్యూస్,తిరుపతి:విద్యుత్ చార్జీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు పెంచ లేదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు విద్యుత్ చార్జీలను పెంచమని హామీ ఇచ్చారని ఆయన తన కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ మేరకు 2025-26 సంవత్సరానికి విద్యుత్ చార్జీలు పెంచడం లేదని ఏపిఈఆర్ సి ఫిబ్రవరిలోనే ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. కానీ వైసిపి నాయకుడు అభినయ్ రెడ్డి మాత్రం విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిందని అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆయన విమర్శించారు.ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచినట్లు అభినయ్ రెడ్డి నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. పాదాచారులకు అసౌకర్యం కలిగిస్తూ వినాయకసాగర్ లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ మాస్క్ లతో అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నాటకం వేయడం అప్రజాస్వామికం అని ఆయన విమర్శించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ లను అవమానించిన అభినయ్ రెడ్డి సహా నాటకం లో పాల్గొన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి
విద్యుత్ రంగాన్ని దివాళా తీయించి ట్రూ ఆఫ్ చార్జీల పేరిట ప్రజలపై భారం మోపారని ఆయన ఆరోపించారు. దీనితో
నాలుగు విడతలుగా ప్రజలు ట్రూ ఆఫ్ చార్జీల భారం మోయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. వచ్చే నెల నుంచి ప్రజలకు ట్రూ ఆఫ్ చార్జీల భారం తప్పనున్నట్లు ఆయన చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా అభినయ్ రెడ్డి తీరు మారలేదని ఆయన విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారని ఆ కలలు ఎప్పటికీ నెరవేరవని ఆయన స్పష్టం చేశారు. అభినయ్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు…వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు అతని రాజకీయ జీవితానికి పులు స్టాఫ్ పెడుతారని ఆయన తెలిపారు. కాగా టిడిఆర్ బాండ్ల స్కాంలో ఉన్న ఏ ఒక్కరిని ప్రభుత్వం విడిచి పెట్టదని ఆయన చెప్పారు. టిడిఆర్ బాండ్ల స్కాంపై విజిలెన్స్, శాఖపరమైన విచారణ జరిగిందనీ
వీటి నివేదికల ఆధారంగా స్కాంకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందఅని ఆయన చెప్పారు.
టిడిఆర్ బాండ్ల పేరిట అధిక సొమ్ము పొందిన వారి నుంచి రికవరీ చేసి శిక్ష పడేలా చేస్తామన్నారు.
మాస్టర్ ఫ్లాన్ రోడ్డ్స్ లో భూమి కోల్పోయిన అర్హులందరికి టిడిఆర్ బాండ్స్ ఇప్పిస్తామనీ ఆయన మరొక్కసారి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు నైనార్ మహేష్ యాదవ్, రాజా రెడ్డీ, రాజేష్ యాదవ్, ఆకేపాటి సుభాషిణి, బత్తిన మధుబాబు, జీవకోన సుధా, బాబ్జీ, పోటుకూరు ఆనంద్, ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, ఆముదాల వెంకటేష్, రాజేష్ ఆచ్చారి తదితరులు పాల్గొన్నారు.
