మన ధ్యాస, కందుకూరు, ఆగస్టు 16 : చెప్పిన మాటను నిలబెట్టుకుని ప్రజల ముందుకు వచ్చామని, కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి స్థానిక ఎన్నికల్లో ఆదరించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. శనివారం కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం పెద్దపట్టపాళెం గ్రామంలో రూ.20 లక్షల సొంత నిధులతో నిర్మించిన బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జిని, రూ.20.50 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఎంపీ కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు తో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…. ఎన్నికలకు ముందు ఇదే గ్రామానికి వచ్చి గ్రామ పెద్దలతో మాట్లాడిన సందర్భంలో బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తుచేశారు. అప్పుడే బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం రూ.20 లక్షల సొంత నిధులతో బ్రిడ్జిని పూర్తి చేసి ఈ రోజు ప్రజలకు అంకితం చేయడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోందని అన్నారు.బ్రిడ్జి నిర్మాణాన్ని తూతూమంత్రంగా కాకుండా ఎంతో నాణ్యతతో పూర్తి చేశారని, దీంతో గ్రామ ప్రజలకు రాకపోకల విషయంలో, ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని, జీవితంలో ఇలాంటి మంచి పనులు చేస్తే భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.గ్రామంలోనే వైద్య సేవలు…పెద్దపట్టపాళెం గ్రామంలో రూ.20.50 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను కూడా ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎంపీ అన్నారు. క్లినిక్‌లో 14 రకాల ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గతంలో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై గ్రామంలోనే ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్నారని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారని తెలిపారు. గూడూరు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తో జరిగిన సంభాషణను గుర్తుచేస్తూ, గంటల తరబడి నిలబడి పనిచేయడం ఎలా సాధ్యమని అడిగితే, ప్రజలకు మాటిచ్చాను.. నిలబెట్టుకోవాలి కదా అని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు. చంద్రబాబు పడుతున్న కష్టంలో తాము పది శాతం కష్టపడి పనిచేసినా రాష్ట్రంలో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంటుందని తాను చెప్పానని ఎంపీ పేర్కొన్నారు.రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం…రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోయినా, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఎంపీ అన్నారు. కందుకూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు లాంటి నాయకుడు ఉండటం ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తి చేయించడంలో నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ పాలన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, ప్రజలు మా నాయకుల మాటలను మాత్రమే కాకుండా కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పెద్దపట్టపాళెంలో బ్రిడ్జి నిర్మించకపోయి ఉంటే ఈ రోజు ప్రజల ముందు మాట్లాడే హక్కు తమకు ఉండేది కాదని, చెప్పింది చేసి చూపించాం కాబట్టే ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడితే భవిష్యత్తులో ప్రజలకు ఇంకా ఎక్కువ సంక్షేమం, అభివృద్ధి అందించగలమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పెద్దపట్టపాళెం గ్రామంతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఉలవపాడు మండలానికి తాను ఎన్నోసార్లు వచ్చానని అన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి కందుకూరు నియోజకవర్గానికి ఇప్పటికే రూ.1.35 కోట్లను కేటాయించామని తెలిపారు. రాబోయే మూడేళ్లలోనూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
‘


