

మన న్యూస్: రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నా కాంట్రాక్టర్లు,అధికారుల నిర్వాకం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడంతో నిర్మించిన కొద్ది రోజులకే రోడ్లు శిధిలమ వుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. గొల్లప్రోలు శివారు జాతీయ రహదారి నుండి చెందుర్తి గ్రామానికి వెళ్లే రహదారి ధ్వంసం కావడంతో వారం రోజుల క్రితం మరమత్తు పనులు చేపట్టారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర సుమారు 24 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు మరమ్మత్తు పనులు నిర్వహించారు. పనులు నిర్వహించి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే రోడ్డుపై గుంతలు ఏర్పడటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు చోట్ల గుంతలను పూడ్చిపెట్టకుండా తూతూ మంత్రంగా మరమత్తు పనులు ముగించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి . సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారం పనులు నిర్వహించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పనులలో నాసిరకం తారు, మెటీరియల్ వినియోగించడం తారును తగు మోతాదులో కలపకపోవడంతో రోడ్డు తక్కువ కాలంలోనే శిధిలావస్థకు చేరుకునే అవకాశముందని పలువురు తెలిపారు. అలాగే గతంలో కూడా రెండు పర్యాయాలు లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ రోడ్డుకు మరమత్తు పనులు నిర్వహించగా కొద్ది రోజులలోనే శిధిలమయ్యిందని ఇప్పుడు కూడా నాసిరకంగా పనులు నిర్వహించడంతో మరల శిథిలావస్థకు చేరుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే చెందుర్తి రోడ్డుమరమ్మత్తు పనుల నాణ్యత పై విచారణ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.