మన న్యూస్: కాకినాడ, డిసెంబర్ 18: కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కు మరో ఆరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసు ఎంపీగా, కాకినాడ జిల్లా అభివృద్ధిపై తనదైన మార్క్ చూపిస్తున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇటీవల న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న తొలి ఎంపీగా చరిత్ర సృష్టించగా తాజాగా ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డును అందుకున్నారు. పిన్న వయసులోనే వ్యాపారవేత్తగా రాణించి ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సేవల ను గుర్తించిన భారత్ గౌరవ్ అవార్డు ఫౌండేషన్ నిర్వాహకులు భారత్ గౌరవ్ అవార్డును అందజేశారు. బుధవారం న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చేతుల మీదుగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఈ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 5 మంది ఎంపీలకు ఈ అవార్డును ప్రధానం చేయగా అందులో కాకినాడ ఎంపీ కి స్థానం దక్కడం గమనార్హం. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత్ గౌరవ్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు. వ్యాపారవేత్తగా రాణిస్తున్న తనను గుర్తించి రాజకీయంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ గౌరవ్ అవార్డు అందుకున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను కూటమి నాయకులు,కార్యకర్తలు ఘనంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *