
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం గ్రామంలో విచ్చలవిడిగా నాటు సారా అమ్మకాలు జరుగుతున్న నిలుపుదల చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏగుపాటి అర్జున్ రావు అన్నారు.ఈ మేరకు ఏలేశ్వరం మండలం బద్రవరం గ్రామంలో మంగళవారం అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏగుపాటి అర్జునరావు మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ప్రతి గ్రామంలో నాటు సారా, నాసిరకం మద్యం, అనుమతుల్లేని గుట్కా పాన్ పరాకులు, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. మాదకద్రవ్యాలకు బానిసలైన యువత తమ ఇష్టానుసారంగా బైక్ రైలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడుతూ చెడు మార్గాలు పట్టి జీవితాలను నాశనం చేసుకుంటుంటే పోలీసు యంత్రాంగం రాజకీయ పైరవీలతో తూతూ మంత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి కేసులు కట్టి చేతులు దులుపుకుంటున్నారన్నారు . ఇక నాటు సారా అమ్మకం దారులు, బెల్ట్ షాపుల యజమానులు యదేచ్చగా మద్యాన్ని అమ్ముతుంటే సంబంధిత అధికారులు రాజకీయ పైరవీలకు తలొగ్గి మామూళ్ల మత్తులో జరుగుతున్నారంటూ వారు ఆరోపించారు. మద్యం వ్యాపారులైతే సిండికేట్ గా ఏర్పడి కూటమి ప్రభుత్వ నాయకుల ఆదేశాలతో ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారంటూ అర్జునరావు అన్నారు. అలాగే ఐఫ్వా మహిళ సంఘ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో భారీ ఎత్తున సారా అమ్మకాలు జరుగుతుంటే తమ భర్త, పిల్లలు మద్యానికి బానిసై నరకం చూపిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాగే సాగితే కూటమి ప్రభుత్వంపై మరో రాష్ట్రవ్యాప్త సారా ఉద్యమం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిల్లి చంద్రమ్మ, గుల్ల పెద్ద సత్యవతి, శ్రీమంతుల నూకాలమ్మ, సీలి మరియమ్మ, విప్పర్తి కుమారి, ముప్పిడి నాగమణి, జొన్నాడ పాప తదితరులు పాల్గొన్నారు.