మన ధ్యాస పార్వతీపురం, అక్టోబర్ 23 : – పార్వతిపురం జిల్లాలోని జల వనరులు మరియు చెరువులు ఆక్రమణ కాకుండా పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో చెరువులు, జలవనరులపై జేసీ సమీక్షించారు. ఈ సందర్బంగా గత సమావేశాల్లో తీసుకున్న చర్యల నివేదికలను జేసీ అడిగి తెలుసు కున్నారు. జిల్లాలోని నీటి కుంటలు మరియు ట్యాంక్ బెడ్‌లను గుర్తించాలని, వాటికి సంబంధించిన సర్వే మరియు సరిహద్దులను స్థిరీకరించాలని అన్నారు. గుర్తించిన వాటిని ఆక్రమణకు గురికాకుండా చూడాలని, ఇప్పటికే ఆక్రమణలు జరిగితే వాటిపై చర్యలు తీసుకోవాలంజ జేసీ ఆదేశించారు. ఆక్రమణకు గురైన ట్యాంకులను పునరుద్ధరించాలని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. గిరిజనుల భూమి రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉందన్నారు. ముఖ్యంగా జల వనరులు, చెరువుల బెడ్లను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఆక్రమణలను నివారించడానికి మరియు తొలగించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, పార్వతీపురం మునిసిపల్ కమిషనర్ జి. శ్రీనివాసరాజు, బూడా (BUDA) బొబ్బిలి అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి, సుడా (SUDA) శ్రీకాకుళం ప్లానింగ్ అధికారి, పార్వతీపురం ఇరిగేషన్ కార్యనిర్వాహక ఇంజనీర్, జిల్లా గ్రామ పంచాయతీ శాఖ పరిపాలనా అధికారి, పార్వతీపురం పట్టణ ప్రణాళిక అధికారి, జిల్లా పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ అధికారి, సాలూరు, పాలకొండ మున్సిపల్ కమిషనర్లు, ఆశాజ్యోతి ఆశ్రమం తదితరులు పాల్గొన్నారు.









