

మన న్యూస్,తిరుపతి :– ప్రజా రవాణా శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు నిర్వహించినట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా సెక్రెటరీ బిఎస్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బిఎస్ బాబు మాట్లాడుతూ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, వేతన సవరణ ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయినందున వెంటనే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ డిపో తరలించడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని, నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ హెచ్ ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, ఎలక్ట్రిక్ బస్సులను స్వయంగా ప్రభుత్వం ద్వారానే లేదా ప్రజా రవాణా శాఖ ద్వారా కొనుగోలు చేసి నడపాలన్నారు. గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించి వెంటనే అధికారులు పరిష్కారం చూపాలని ఆయన కోరారు. రిటైర్డ్ ఆర్టిసి ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతించాలని కోరారు. కావున అన్ని డిపోల ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులందరూ మంగళవారం బుధవారం రెండు రోజులపాటు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని కావున కార్మికులందరూ ధర్నాకు హాజరుకావాలని అన్ని డిపోల ఎదుట ఆయా డిపోల అధ్యక్ష కార్యదర్శులతో పాటు యూనియన్ కార్మికులు పాల్గొనని జయప్రదం చేయాలని బిఎస్ బాబు కోరారు.