​డిసెంబర్ మొదటి వారంలో ప్రధాని మోదీ పర్యటన

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

​తిరుపతి.

రాబోయే డిసెంబర్ మొదటి వారంలో తిరుపతి నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న దేశవ్యాప్త డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణలతో కలిసి కలెక్టర్ ఉన్నత స్థాయి ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే ఉన్నతాధికారులు, ఇతర అతిథుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ వసతి గృహాలు, హోటళ్లు, హోమ్‌స్టేల వివరాలను సేకరించి రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వసతి ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, అలుమ్ని గెస్ట్‌హౌస్‌లలోని మిగిలిన పనులను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

​ముఖ్యంగా భద్రత, రవాణా, రహదారుల నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా క్షేత్రస్థాయి పరిశీలనలు జరపాలన్నారు. ఐసర్ , ఐఐటీ , ఇండియన్ కులినరీ ఇన్‌స్టిట్యూట్ లలో చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు సంయుక్త క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించనున్నట్లు తెలిపారు.

​ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నర్సింహులు, అదనపు ఎస్పీలు, ఆర్డీఓలు, తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ భూమినాథన్, సీఐఎస్‌ఎఫ్, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్ బి శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *