మన ధ్యాస,( జుక్కల్‌, ) సెప్టెంబర్‌ 24 : అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందజేస్తామని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌, బాన్సువాడ ఆర్డీఓ రవీందర్‌రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. కార్డులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన కుటుంబాలకు రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.స్మార్ట్‌ రేషన్‌ కార్డు ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులతో పాటు, రేషన్‌ కార్డును ఆధారంగా పొందే వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అర్హత ఉన్న ఒక్క కుటుంబం కూడా మిగిలిపోకుండా స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందేలా చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

అనంతరం డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి ఒక్క నాయకులు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చీకోటి మనోజ్‌కుమార్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు ప్రజా పండరి, తహసీల్దార్‌ సాయిబుజంగారావు, ఎంపీడీఓ శివకృష్ణ, సర్పంచులు సంకు లక్ష్మయ్య, కేతావత్‌ నారాయణ, మోహన్‌, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *