తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ప్రగతి పరుగులు పెట్టింది. గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మండల వ్యాప్తంగా భారీగా అభివృద్ధి పనులు జరిగాయని రేణిగుంట ఎంపీపీ కాలాపాటి హరిప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన అధికారిక గణాంకాలను విడుదల చేశారు.

రేణిగుంట మండల ప్రజల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో, గత ఐదేళ్ల కాలంలో పాలకవర్గం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మండల పరిధిలోని మొత్తం 480 అభివృద్ధి పనుల కోసం రూ. 8,64,30,580 (ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల ముప్పై వేల ఐదు వందల ఎనభై రూపాయలు) నిధులను వెచ్చించినట్లు ఎంపీపీ తెలిపారు.
పట్టణ కేంద్రంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, తాగునీటి పథకాలు, పాఠశాలల ఆధునీకరణ వంటి పనులు పూర్తయ్యాయి.
కేవలం మండల కేంద్రమైన రేణిగుంట పట్టణంలోనే, అభివృద్ధి పనులకు రూ. 1,61,87,975 ఒక కోటి అరవై ఒక లక్షా ఎనభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయల నిధులు కేటాయించడం ద్వారా పట్టణ రూపురేఖలు మార్చారు. ఇక్కడ మొత్తం 89 పనులు జరిగాయి.
అలాగే, మండలంలోని ఇతర ప్రధాన పంచాయతీలలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలను పరిశీలిస్తే:
అత్తూరులో రూ. 1.54 కోట్లకు పైగా విలువైన 96 పనులు.
కరకంబాడిలో రూ. 93 లక్షలకు పైగా 45 పనులు.
వెంకటాపురంలో రూ.64 లక్షలకు పైగా 36 పనులు, ఆర్ మల్లవరంలో రూ. 53 లక్షలకు పైగా 36 పనులు గుత్తి వారి పల్లిలో రూ. 50 లక్షలకు పైగా 30 పనులు అయ్యాయి. ఇలా ప్రతి గ్రామంలో నిధుల కేటాయింపు పారదర్శకంగా జరిగిందని, ఈ అభివృద్ధి పనుల వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని స్థానిక నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

