పంచాయతీ మోటార్ ఆఫ్ చేస్తూ వైర్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన రేణుకార్జున.
రేణిగుంట మండలం, ఎల్లమండ్యం గ్రామ పంచాయతీ పరిధిలోని పిల్లపళ్ళెం హరిజనవాడ వద్ద విద్యుత్ షాక్ తగిలి మంచికాయలు రేణుకార్జున (47) అనే వ్యక్తి మృతి చెందినట్లు గాజులమండ్యం సీఐ మంజునాథరెడ్డి తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 22వ తేదీ రాత్రి సుమారు 07:30 గంటల సమయంలో గ్రామానికి నీటి సరఫరా చేసే పంచాయతీ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న మోటార్‌ను ఆఫ్ చేయడానికి రేణుకార్జున వెళ్లారు. అక్కడ ఉన్న స్టార్టర్‌ను ఆఫ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై కేకలు వేస్తూ స్పృహ తప్పి పడిపోయారు.
గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం రేణిగుంటలోని సన్‌రైజ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తీసుకువెళ్లగా, రాత్రి 09:52 గంటల సమయంలో డ్యూటీ వైద్యులు పరీక్షించి, ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
మోటార్ స్టార్టర్‌కు విద్యుత్ సరఫరా చేసే వైరు దెబ్బతినడంతో, స్టార్టర్ ఐరన్ బాక్స్‌కు విద్యుత్ ప్రసారమై ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా, తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని మృతుని భార్య తెలిపినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ ఘటనపై గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
