మన ధ్యాస, నెల్లూరు, ఆగస్టు 16 : డీఎస్సీ-2025లో ఉద్యోగాల అమ్మకాలు, స్పోర్ట్స్ కోటా గోల్‌మాల్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలి…విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి… వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నెల్లూరు నగరం సాయిరాం నగర్ జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన వైయస్సార్సీపీ నేత పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…….రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలిసి ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులను ఎటువంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం ముమ్మాటికీ కక్షసాధింపు చర్యలేనని తేల్చి చెప్పారు. డీఎస్సీ-2025 నిర్వహణలో ప్రశ్నాపత్రాల లీకేజీ, స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో అక్రమ నియామకాలు, జీవోల ట్యాంపరింగ్ వంటి భారీ కుంభకోణాలు సాక్ష్యాధారాలతో బట్టబయలైనా ప్రభుత్వం దబాయింపు ధోరణి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, డీఎస్సీ అక్రమాలతో పాటు గ్రూప్-1 వ్యవహారంపై కూడా సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్సీపీ తరపున డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల మెడపై టెట్ కత్తి పెట్టి వేధిస్తున్నారు…రాష్ట్రంలో దాదాపు 30 సంవత్సరాలకు పైగా సర్వీస్ పూర్తి చేసుకుని, రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావాలనే నిబంధన పెట్టడం తీవ్ర అన్యాయం. 55-60 ఏళ్ల వయసులో మళ్లీ అన్ని సబ్జెక్టులు చదివి, ఓసీలకు 90%, బీసీలకు 70%, ఎస్సీ-ఎస్టీలకు 60% మార్కులు సాధించాలనడం ఎంతవరకు సబబు? ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరితే కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, టీచర్ల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీల సహకారంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఢిల్లీ వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఎయిర్‌పోర్టులో తమ ప్రజాప్రతినిధులతో ఫోటో దిగినంత మాత్రాన కాండక్ట్ రూల్స్ ఉల్లంఘించారని అనంతపురం, కడప జిల్లాలకు చెందిన నలుగురు టీచర్ లీడర్లను అక్రమంగా సస్పెండ్ చేశారు. ఎటువంటి ముందస్తు వివరణ అడగకుండా ఉద్యోగ సంఘాల నాయకులను సస్పెండ్ చేయడం నా 40 ఏళ్ల సర్వీసులో ఎప్పుడూ చూడలేదు అని తెలిపారు.కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటినా పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏలు, బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలపై విధించిన సస్పెన్షన్ వేటును ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపుపై తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలి అని అన్నారు.టీచర్లను సస్పెండ్ చేయడం దారుణం…. లక్ష మందికి పైగా ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి చేసి, పాస్ అయితేనే ప్రమోషన్.. లేదంటే ఉద్యోగానికి ముప్పు అనే పరిస్థితి తీసుకురావడం అన్యాయం. ఇప్పటికే ఉద్యోగ పరీక్షలు రాసి, ఏళ్లుగా సేవలందిస్తున్న టీచర్లకు మళ్లీ అన్ని సబ్జెక్టులు చదివి టెట్ రాయాలని చెప్పడం ఎలా సాధ్యం? వారికి శిక్షణ ఇవ్వాలి కానీ మెడపై కత్తి పెట్టినట్లు పరీక్షను తప్పనిసరి చేయకూడదు. టెట్ నుంచి మినహాయింపు కోరుతూ ఎమ్మెల్సీలు, ఎంపీల ద్వారా కేంద్రానికి ప్రాతినిధ్యం వహించడానికి ఢిల్లీ వెళ్లిన టీచర్ సంఘ నాయకులను ఎలాంటి వివరణ, విచారణ లేకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గం. ప్రజాప్రతినిధులను కలవడం, తమ సమస్యలను కేంద్రానికి చెప్పడం ఉద్యోగుల హక్కు. డీఎస్సీ పేరుతో అసలు అంశాన్ని పక్కదారి పట్టించకుండా వెంటనే సస్పెన్షన్లు రద్దు చేయాలి. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి అని అన్నారు.డీఎస్సీ అక్రమాలపైనా, ఏపీపీఎస్సీపైనా సీబీఐ విచారణకు సిద్దమా?…రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ నిర్బంధ పాలన కొనసాగిస్తున్నారు. డీఎస్సీ-2025లో జరిగిన అవకతవకలపై 3 లక్షల మంది అభ్యర్థుల గొంతుకగా వైఎస్సార్సీపీ పోరాడుతోంది. ఒక్కో డీఎస్సీ ఉద్యోగాన్ని రూ. 13 లక్షల నుంచి 15 లక్షలకు అమ్ముకున్నారు. క్వశ్చన్ పేపర్ లీకేజీతో పాటు జీవో 4, జీవో 47 వంటి దొంగ జీవోలు తెచ్చి అక్రమాలకు పాల్పడ్డారు. తప్పులు బయటపడటంతో ఆ జీవోలను ఉపసంహరించుకున్నారు అని అన్నారు.టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హోదాలో నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు పెట్టి ఇచ్చిన సర్టిఫికెట్లతో 35 మందికి అక్రమంగా టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టారు. ఈ అక్రమాలపై మేము ఆధారాలు చూపిస్తుంటే ప్రభుత్వ వెబ్‌సైట్లలో డాక్యుమెంట్లను పదేపదే ట్యాంపరింగ్ చేస్తున్నారు. డీఎస్సీ అవకతవకలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ-2025తో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్-1 రిక్రూట్‌మెంట్‌పై కూడా సీబీఐ విచారణ వేయాలి అని అన్నారు.డియస్సీ, ఏపీపీఎస్సీ రెండింటి పైనా సీబీఐ విచారణకు సిద్ధమా?…. డీఎస్సీ-2025లో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సీ-గ్రూప్-1 నియామకాలపై ఆరోపణలు చేస్తోంది. ఏపీపీఎస్సీపై మీకు నిజంగా అనుమానాలు ఉంటే సీబీఐ విచారణ వేయండి. అదే విధంగా డీఎస్సీ-2025పైనా సీబీఐ విచారణ వేయండి. రెండు అంశాలపైనా సమగ్ర దర్యాప్తు చేయించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల్లో ఎక్కడా అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పరీక్షలు, మూల్యాంకనం నిర్వహించాం. కోవిడ్ సమయంలో డిజిటల్ వాల్యుయేషన్ ప్రతిపాదించినా, కోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ వాల్యుయేషన్ చేశాం. ప్రతి అభ్యర్థి ఏడు పేపర్లను పలు దశల్లో ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్ల పర్యవేక్షణలో మూల్యాంకనం చేశారు. మార్కుల్లో వ్యత్యాసం ఉంటే మళ్లీ వాల్యుయేషన్ చేసే విధానం కూడా ఉంది అన్నారు.సీసీ కెమెరాలు, బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్ వంటి విధానాలతో పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాం. మరి ఇంత పారదర్శకమైన వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్న మీరు విచారణకు ఎందుకు భయపడుతున్నారు? డీఎస్సీ-2025పై ఒక్క విచారణ కూడా చేయకుండా ఏపీపీఎస్సీని తెరపైకి తీసుకురావడం కేవలం డైవర్షన్ కోసమే అని అన్నారు.మీకు చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ-2025, ఏపీపీఎస్సీ రెండింటిపైనా సీబీఐ విచారణకు ఆదేశించండి. తప్పు ఎక్కడ జరిగిందో నిష్పక్షపాతంగా తేల్చుకుందాం. వైయస్. జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలన్నింటిపైనా సమగ్ర విచారణ చేయించి, ఎక్కడా తప్పులకు అవకాశం లేకుండా న్యాయం జరిగేలా చూస్తాం అని తెలిపారు.టీచర్లకు టెట్..ఇదే నిబంధన ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లకు వర్తింపజేస్తారా ? అని ప్రశ్నించారు.30–40 ఏళ్లుగా టీచర్లుగా పనిచేస్తున్న వారికి ఇప్పుడు టెట్ పాస్ కావాలని చెప్పడం ఎంతవరకు న్యాయం? 2009 తర్వాత వచ్చిన నిబంధనను అంతకుముందే ఉద్యోగాల్లో చేరిన టీచర్లకు ఎలా వర్తింపజేస్తారు? ఇదే నిబంధన ప్రజాప్రతినిధులకు, ఐఏఎస్ అధికారులకు, డాక్టర్లకు వర్తిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? 175 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు అర్హత కోసం మళ్లీ డిగ్రీ, పీజీ పరీక్షలు రాయాలని రేపు ఒక చట్టం వస్తే అంగీకరిస్తారా? 30 ఏళ్లుగా ఐఏఎస్‌గా పనిచేసిన కలెక్టర్‌ను మళ్లీ ఐఏఎస్ పరీక్ష రాస్తేనే కొనసాగిస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? 30 ఏళ్లుగా వైద్యం చేస్తున్న డాక్టర్‌కు ఇప్పుడు నీట్ రాసి పాస్ అయితేనే ప్రాక్టీస్ చేయాలని చెబితే సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు.టీచర్ల విషయంలోనే ఈ కక్ష ఎందుకు? వారి నైపుణ్యాలను పెంచాలంటే శిక్షణ ఇవ్వండి, కొత్త బోధనా పద్ధతులు నేర్పండి. కానీ ఇన్నేళ్లుగా పనిచేసిన వారి అర్హతను ఇప్పుడు పరీక్ష పేరుతో ప్రశ్నించడం అన్యాయం. టెట్ మినహాయింపు కోరుతూ ఢిల్లీకి వెళ్లిన ఉపాధ్యాయ సంఘాలపై కనీసం వివరణ కూడా అడగకుండా సస్పెన్షన్లు విధించడం మరింత దారుణం. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కక్షసాధింపు వైఖరిని విడిచిపెట్టి, ఇన్నేళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి అని అన్నారు.30 ఏళ్ల క్రితం సర్వీసులో చేరిన ఉపాధ్యాయులను ఇప్పుడు టెట్ రాయమనడం సీనియర్ డాక్టర్లను నీట్ పరీక్ష రాయమనడం లాంటిదే. దీనిపై కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించిన టీచర్లపై అక్రమ సస్పెన్షన్లు విధించారు. మరోవైపు ప్రొబేషన్‌లో ఉన్న కొత్త డీఎస్సీ టీచర్లను ఎంఈవోలు, డీఈవోల ద్వారా బెదిరించి బలవంతంగా రోడ్లపైకి తెచ్చి రాజకీయ ధర్నాలు చేయిస్తున్నారు.మరోవైపు ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలను పెండింగ్‌లో పెట్టారు. రూ. 23 వేల కోట్లుగా ఉన్న ఉద్యోగుల బకాయిలను రూ. 30 వేల కోట్లకు పెంచారు. రాబోయే శాసనసభ, మండలి సమావేశాల్లో డీఎస్సీ అక్రమాలు, ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం.మంత్రి నారాయణ…… దేనిపై చర్చకు వస్తారో చెప్పండి…మున్సిపల్ మంత్రి నారాయణ గారూ.. దేనిపై చర్చకు వస్తారో చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. అప్పులపైనా, కార్పొరేషన్లలో జరుగుతున్న అవినీతిపైనా, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపైనా, ఉద్యోగులకు ఇచ్చిన బెనిఫిట్స్‌పైనా, సంక్షేమ పథకాలపైనా, అభివృద్ధిపైనా, అప్పటి–ఇప్పటి జీఎస్‌డీపీ, రాష్ట్ర నికర ఆదాయంపైనా దేనిమీద అయినా చర్చకు వస్తాను. డీఎస్సీపై మాట్లాడదామన్నా వస్తాను, మున్సిపాలిటీల్లో జరుగుతున్న దోపిడీపై మాట్లాడదామన్నా వస్తాను. మీరు ఏ అంశం ఎంచుకుంటారో చెప్పండి అని అన్నారు.ప్రజలను మభ్యపెట్టేలా మాట్లాడటం సరికాదు. వ్యక్తిగత విషయాలు, కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం మా సంస్కారం కాదు. అమరావతిలో జరుగుతున్న వ్యవహారాలు, ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ స్కామ్స్, వేల కోట్ల అప్పులు, సెల్ఫ్ సస్టెయినబుల్ సిటీ పేరుతో అప్పులు ఎలా తీరుస్తారనే అంశాలపై కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇక టీచర్లను ధర్నాలకు రావాలని ఎంఈఓలు, డీఈఓల ద్వారా ఒత్తిడి చేసినట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయి. ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం వారి భవిష్యత్తుకు మంచిది కాదని సవినయంగా చెబుతున్నాను అని తెలియజేశారు.
