‘మీ ఇంటికీ మీ సుధీరన్న’ 4వ రోజు పర్యటన.. పొయ్యేలో ఉప్పొంగిన అభిమానం!
తొట్టంబేడు:
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కూటమి పాలన కొనసాగుతోందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ‘మీ ఇంటికీ మీ సుధీరన్న’ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు తొట్టంబేడు మండలం, పొయ్యే పంచాయతీ పరిధిలోని పొయ్యే గ్రామం మరియు పొయ్యే హరిజనవాడలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మహిళలు హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. నాడు స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, ఆ తర్వాత గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ గ్రామానికి జరిగింది శూన్యమని మండిపడ్డారు. మళ్లీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి పరుగులు తీస్తోందని తెలిపారు. గతంలో పొయ్యే పంచాయతీకి అభివృద్ధి, సంక్షేమం ద్వారా మొత్తం రూ. 10 కోట్ల 72 లక్షల నిధులు సమకూరాయని గుర్తు చేశారు.ఈరోజు పర్యటనలో గ్రామానికి అవసరమైన ప్రాధాన్యతా పనుల కోసం రూ. 17.10 లక్షల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేసి, తక్షణమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా పొయ్యే హరిజనవాడ పరిధిలో 500 మీటర్ల సీసీ రోడ్లు మరియు స్లాబ్‌తో కూడిన మురుగుకాలవల నిర్మాణానికి రూ. 15.00 లక్షలు, గురుకులపాలెం హరిజనవాడ వద్ద నూతన హ్యాండ్ బోర్‌వెల్ ఏర్పాటుకు రూ. 1.50 లక్షలు, గురుకులపాలెం గాబచేను వద్ద నూతన పైప్‌లైన్ ఏర్పాటుకు రూ. 60 వేల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.అలాగే గ్రామంలో ప్రధానంగా ఇళ్ల స్థలాలు మరియు హౌసింగ్ సమస్యలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల సమస్య లేకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పొయ్యే రూపురేఖలు మారుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

