మన ధ్యాస,నిజాంసాగర్ ,జుక్కల్ నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్‌రావుపల్లి చౌరస్తా సమీపంలో ఉన్న నల్లవాగు మత్తడి బుధవారం పొంగిపొర్లింది. గత మూడు రోజులుగా సంగారెడ్డి జిల్లా నిజాంపేట్, నారాయణఖేడ్ తదితర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నల్లవాగుకు భారీగా వరద నీరు చేరి మత్తడి నిండుకుండలా మారింది. దీంతో మత్తడి పొంగిపొర్లుతూ జలకళ సంతరించుకుంది.నల్లవాగు మత్తడి కుడి, ఎడమ కాలువల పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు వరి నాట్లను వాయిదా వేసి ఆందోళన చెందారు. అయితే తాజా వర్షాలతో మత్తడికి సమృద్ధిగా నీరు చేరి కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీరు విడుదల కావడంతో రైతులు వరి నాట్ల పనులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.మత్తడి పొంగిపొర్లుతున్న దృశ్యాన్ని చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో పాటు మత్తడికి సమృద్ధిగా నీరు చేరడం తమకు ఎంతో ఊరటనిచ్చిందని రైతులు తెలిపారు. ఇదే విధంగా వర్షాలు కొనసాగితే ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆశాజనకంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *