** ఈనెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా…
- తిరుపతి:* దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల సాధనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బీ.ఐ) క్లరికల్ ఉద్యోగులు సమ్మెకు వెళుతున్నట్లు ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎల్. చంద్రశేఖర్ తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గురించి చర్చించి సమ్మె కార్యాచరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సమావేశం తిరుపతి తిలక్ రోడ్డు బ్రాంచి ఎస్.బీ.ఐ ఆవరణలో జరిగింది. ఈ సమావేశానికి కామ్రేడ్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటివరకు ఆపేసిన మెసెంజర్, ఆర్మ్డ్ గార్థుల నియామకం చేపట్టాలని డిమాండ్ చేశారు. పెన్షన్ విధి విధానాల్లోని లోపాలను సవరించాలని కోరారు. పెన్షన్ లోకి ఆల్ పే కాంపొనెంట్స్ ను యాడ్ చేయాలన్నారు. 2019 నుంచి సర్కిల్ పరిధిలో బదిలీలు చేపట్టాలని కోరారు. ఔట్ సోర్సింగ్, క్రాస్ సెల్లింగ్ లో మిస్ సెల్లింగ్ తక్షణం నిలుపుదల చేయాలన్నారు. హెచ్ఆర్ఎంఎస్ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఫిజీషియన్ కన్షల్టేషన్ ఫీజులు, మెడికల్ ఫీజ్ రీఇంబర్స్ మెంట్ చార్జీలను ఇప్పటి ధరలకు అనుగుణంగా పెంచాలని కోరారు. క్లరికల్ ఉద్యోగాలను పెంచాలన్నారు. ఈ సమావేశంలో రీజనల్ ఎస్.బీ.ఐ ఉద్యోగుల ఫెడరేషన్ ఉపాధ్యక్షులు గిరిధర్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రసాద్, పలువురు ఫెడరేషన్ నాయకులు, సభ్యులు పాల్గొని జయప్రదం చేశారు. వాళ్లందరికీ ఏజీ గిరిధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
