శుభాకాంక్షలు
తెలుపుతున్న అభిమానులు…

సేవా పథంలో డాక్టర్ షేక్. ఫరీద్ బాబా…
రేణిగుంట మే 3
రేణిగుంట ప్రాంతంలో మానవత్వానికి నిలువుటద్దంగా నిలుస్తున్న వ్యక్తి ఎం.ఏ. జబ్బార్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్. ఫరీద్ బాబా. మే 3, 1965న ఎంఏ జబ్బర్, సైదాని దంపతులకు జన్మించిన ఆయనకు సేవ అనేది తండ్రి నుందే వారసత్వంగా అబ్బింది. రైల్వేలో టీటీఈగా పనిచేసిన ఆయన తండ్రి, రైలులో టికెట్ కొనే స్తోమత లేని పేద ప్రయాణికులకు తన సొంత డబ్బుతో టికెట్లు కొనిపించి ఆదుకోవడమే కాకుండా, తన వంతుగా కళాకారులను, క్రీడాకారులను ఎంతో ప్రోత్సహించేవారు. తండ్రిలోని ఆ ఉదాత్తమైన సేవా గుణాలను, కళలు మరియు క్రీడల పట్ల ఆయనకున్న మక్కువను వారసత్వ లక్షణాలుగా పునికిపుచ్చుకున్న ఫరీద్ బాబా, తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు.
​2009లో తన తండ్రి జ్ఞాపకార్థం ‘ఎం.ఏ. జబ్బార్ ట్రస్ట్’ను స్థాపించి అప్రతిహతంగా సామాజిక సేవ చేస్తున్నారు. ఆర్పీఎఫ్ అధికారిగా రైల్వేలో సేవలందించి విరమించినా, ప్రజా సేవలో మాత్రం విశ్రాంతి లేకుండా కొనసాగుతున్నారు. ముఖ్యంగా పేదరికం కారణంగా ప్రతిభ ఉండి కూడా ఎదగలేకపోతున్న కళాకారులకు, క్రీడాకారులకు ఆయన కొంగుబంగారమై నిలుస్తున్నారు. తన పీఎఫ్ పెన్షన్ డబ్బును సైతం పేద క్రీడాకారుల శిక్షణకు, వారికి అవసరమైన క్రీడా సామాగ్రి అందించడానికి వెచ్చిస్తూ వారిని ఛాంపియన్లుగా తీర్చిదిద్దుతున్నారు.
​తండ్రి ఏ విధంగానైతే ఆ కాలంలో కళాకారులకు అండగా నిలిచారో, అదే స్ఫూర్తితో అంతరించిపోతున్న కళలను నమ్ముకున్న నిరుపేద కళాకారులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తూ వారి ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. కేవలం మనుషులకే కాకుండా మూగజీవాల పట్ల కూడా ఫరీద్ బాబా అపారమైన ప్రేమను చాటుకుంటున్నారు. వీధి జంతువులకు ఆహారం అందించడంతో పాటు, ఎగిరే పక్షుల దాహం తీర్చడానికి ప్రత్యేక పాత్రలను ఏర్పాటు చేస్తున్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లు, మరుగుజ్జులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ వారికి నూతన వస్త్రాలు, నిత్యావసరాలు పంపిణీ చేస్తూ ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.
​కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో లోకం గడప దాటడానికి భయపడుతున్న వేళ, తన ట్రస్ట్ ద్వారా నిరంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఎందరో ఆకలి తీర్చారు. “మానవ సేవయే మాధవ సేవ” అన్న సూక్తిని అక్షరాలా పాటిస్తూ, అనాథలకు, వృద్ధులకు నిరంతరం అండగా నిలుస్తున్న డాక్టర్ షేక్. బాబా పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్పీఎఫ్ మిత్రులు, రాజకీయ నాయకులు, బంధువులతో పాటు ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందిన వేలాది మంది ప్రజలు ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *