రేణిగుంట మే 2
దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లి భూముల సమస్యకు పరిష్కారం లభించిన నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి శనివారం తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్వయంగా పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్న ఛైర్మన్, అక్కడ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన శెట్టిపల్లి రైతులతో మాట్లాడారు.
డాక్యుమెంట్ల పరిశీలన, స్లాట్ బుకింగ్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. శెట్టిపల్లి భూములకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు ఏవైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని, రైతులకు అనవసరమైన జాప్యం చేయకూడదని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చొరవతో శెట్టిపల్లి రైతుల ఏళ్ల నాటి కల సాకారమైంది.ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక అరుదైన మరియు ఆదర్శవంతమైన ప్రక్రియ అని దివాకర్ రెడ్డి అన్నారు.దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ, సుమారు 16 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వం భరించింది.లబ్ధిదారులపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నలిగిపోయిన రైతులకు ఈరోజు పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయడం సంతోషదాయకం అని తెలిపారు.ఇప్పటివరకు దాదాపు 1300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని,మిగిలిన దాదాపు 700 మంది కూడా తమ స్థలాల రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత అధికారులను సంప్రదించి త్వరిత గతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో దళారుల ప్రమేయం లేకుండా, రైతులు నేరుగా అధికారులను సంప్రదించి తమ పనులు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అదనపు పని గంటలు కేటాయించి సేవలు అందిస్తున్నారన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు భూసేకరణ అధికారుల బృందం, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ మరియు రెవెన్యూ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడా తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు.శెట్టిపల్లి రైతుల భూ సమస్య పరిష్కారం అనేది ఒక చారిత్రాత్మక విజయం. ఈ భూములపై రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని,ఎక్కడా అవినీతికి తావులేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయడమే లక్ష్యమని తెలిపారు. ఎన్డీయే కూటమి ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శెట్టిపల్లి ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.వచ్చే వారం లేదా పది రోజుల్లో ఇన్‌ఛార్జ్ మంత్రి మరియు మున్సిపల్ శాఖ మంత్రి ని తిరుపతికి ఆహ్వానించి, లబ్ధిదారులందరికీ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఒరిజినల్ డాక్యుమెంట్లను అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు, భూ సేకరణ అధికారి సుజన, సబ్ రిజిస్ట్రార్ విజయ కుమార్,రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు,తుడా అధికారులు మరియు శెట్టిపల్లి వాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *