తవణంపల్లి, ఏప్రిల్ 05, మన ద్యాస
మాజీ మంత్రివర్యులు గల్లా అరుణ కుమారి మరియు అమర రాజా వ్యవస్థాపక అధ్యక్షుడు గల్లా రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎంపీ కీ.శే. శ్రీ పాటూరు రాజగోపాల్ నాయుడు 106వ జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాగం గ్రామంలోని రాజన్న మెమోరియల్ పార్క్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అమర హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గౌరీనేని ప్రసాద్ , మేనేజింగ్ డైరెక్టర్ గౌరీనేని రమాదేవి కలిసి రాజగోపాల్ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు.

అదేవిధంగా, గల్లా అరుణ కుమారి మనవడు, యువ హీరో గల్లా అశోక్ జన్మదినం సందర్భంగా అభిమానులు మరియు సమీప గ్రామాల ప్రజలు భారీ కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ గౌరీనేని ప్రసాద్ మాట్లాడుతూ, పాటూరు రాజగోపాల్ నాయుడు జీవితం యువతకు ఆదర్శప్రాయమని, ఆయన తీసుకున్న సంస్కరణలు అనేక మంది విద్యార్థుల పురోగతికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.

గౌరీనేని రమాదేవి మాట్లాడుతూ, రాజగోపాల్ నాయుడు రాష్ట్ర అభివృద్ధికి విశేష సేవలు అందించారని, ముఖ్యంగా విద్య, వైద్య రంగాలలో అనేక సంస్కరణలకు కృషి చేశారని తెలిపారు. ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ, తన తండ్రి మరియు మనవడు అశోక్ జన్మదినాలు ఒకే రోజు రావడం ఆనందదాయకమని, ఇద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అశోక్ సినీరంగంలో మరింత ఎదగాలని ఆకాంక్షించారు.

గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ, రాజగోపాల్ నాయుడు అనేక మందికి మార్గదర్శిగా నిలిచారని కొనియాడి, అశోక్‌కు ఆశీర్వాదాలు అందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కోలాటాలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో దిగువమాగం మాజీ సర్పంచులు కుమార్ నాయుడు, గోపి, గల్లా రాధాకృష్ణ, రాజన్న ఫౌండేషన్ హెడ్ రాళ్లపల్లి సతీష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గల్లా అశోక్ అభిమానులు సురేష్ ఎల్లంపల్లి తదితరులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *