మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలం బుర్గుల్ గ్రామంలో గురువారం రాత్రి సాధారణంగా ప్రారంభమైన రోజు,క్షణాల్లో ఉద్రిక్తతకు దారి తీసింది.కుటుంబ విభేదాలతో మనస్తాపానికి గురైన మొట్ట శ్రావణి అనే యువతి గ్రామంలోని సుమారు 60 అడుగుల ఎత్తైన స్థిర నీటి ట్యాంక్‌పైకి ఎక్కింది.విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే బాన్స్‌వాడ సబ్ కలెక్టర్కి రణ్మయి,ఎస్ఐ శివకుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.పరిస్థితి గంభీరంగా ఉందని గ్రహించిన కిరణ్మయి,ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ధైర్యంగా ట్యాంక్‌పైకి ఎక్కారు.పైకి చేరుకున్న ఆమె,భయంతో ఉన్న యువతిని ఓదార్చుతూ మెల్లగా మాట్లాడటం ప్రారంభించారు.“

జీవితంలో సమస్యలు శాశ్వతం కావు ..ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది”అని ఆమె నమ్మకం కల్పించారు. కుటుంబం,భవిష్యత్తు గురించి వివరంగా చెప్పి,ఆమె మనసులో ధైర్యం నింపారు. కొద్ది సేపటికి యువతి మనసు మార్చుకుని సురక్షితంగా కిందికి దిగేందుకు అంగీకరించింది.
కింద ఉన్న అధికారులు,ఫైర్ సిబ్బంది, గ్రామస్థులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఎటువంటి ప్రమాదం జరగకుండా యువతిని కిందికి దించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ శివకుమార్ మాట్లాడుతూ.. “సమయానికి స్పందించి స్వయంగా ముందుకు వెళ్లిన సబ్ కలెక్టర్ కిరణ్మయి చొరవ వల్లే ఈ ఘటన సుఖాంతం అయ్యింది అని తెలిపారు.ఈ ఘటనలో ఎల్లారెడ్డి ఫైర్ స్టేషన్ సిబ్బంది,గ్రామ సర్పంచ్ జీవన్, స్థానిక పెద్దలు సమన్వయంతో పనిచేశారు. ప్రస్తుతం యువతి సురక్షితంగా ఉండగా, గ్రామంలో అందరూ సబ్ కలెక్టర్ కిరణ్మయి ధైర్యాన్ని అభినందిస్తున్నారు.
